13, మే 2011, శుక్రవారం

కొత్త కోటేశ్వరరావు Prof. Kotha Koteswara rao

జ్ఞాపకాలు
'హౌస్ ఈజ్ ఆన్ ఫైర్' అని పిలిస్తే వెళ్లాను

కొత్త కోటేశ్వరరావు
వరంగల్ ఆర్ఇసి రిటైర్డ్ ప్రిన్సిపాల్


వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినెవర్నయినా కదిలించండి ... అక్కడ పదహారేళ్ల పాటు పనిచేసి రిటైరయిన ప్రిన్సిపాల్ కొత్త కోటేశ్వరరావు గురించిన ప్రస్తావన తప్పకుండా వస్తుంది. సైద్ధాంతిక విభేదాలు కర్రల దాకా వచ్చి గొడవలుగా మారుతున్న తరుణంలో కూడా ఆయన ఆర్ఇసిని అదుపు తప్పకుండా ఉంచడాన్ని వాళ్లెంతో ఇష్టంగా గుర్తు చేసుకుంటారు. మన రాష్ట్రంలో ఎమ్‌సెట్ ప్రారంభించడానికీ, దేశవ్యాప్తంగా 'గేట్'ను పెట్టడానికీ కారకుడాయనే. విద్యారంగం పట్ల ఎంతో ప్రేమ, అవగాహన ఉన్న 80 ఏళ్ల ఈ విశ్రాంతాచార్యుడి జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే...

"తెనాలి దగ్గర సంగం జాగర్లమూడిలో పుట్టాను. ఇంటర్మీడియెట్ తర్వాత మద్రాస్ గిండీ కాలేజీలో 1947లో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాను. అప్పట్లో కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్‌లో ప్రవేశాన్నిచ్చేవాళ్లు. అప్పటికింకా మనది అవిభక్త రాష్ట్రం కావడం, దక్కను నిజామ్ ఏలుబడిలో ఉండటంతో ఆ ప్రాంతం కాలేజీల్లో మేమెవరం పెద్దగా చేరేవాళ్లం కాదు. నేనింకా ఇంటర్లో ఉండగానే కాకినాడ, అనంతపురాల్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. '51కల్లా నా చదువు పూర్తయింది. విజయవాడ పీడబ్ల్యూడీలో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలోకి ప్రవేశించాను.

నెలకు నూటయాభై రూపాయల జీతం. ఆ తర్వాత బర్మా షెల్ ఆయిల్ కంపెనీలో కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్‌గా వెళ్లాను. కాని అలాంటి ఉద్యోగాల్లో ఇమడలేను, బోధనకయితేనే బాగా సరిపోతాను అనే నిర్ణయానికొచ్చేశాను. అప్పుడే అంటే 1955లో ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభిస్తున్నారని తెలిసింది. దరఖాస్తు చేసి వెంటనే చేరిపోయాను. అప్పట్లో ఇంజనీరింగ్‌లో పీజీ మనదగ్గరెక్కడా ఉండేది కాదు. అందువల్ల ఆంధ్రా యూనివర్సిటీలో నాలాగా చేరిన అధ్యాపకులకు కొంత శిక్షణనివ్వడానికి, మా పీజీ పూర్తి చేయడానికి వీలుగా ఒక నూట ఇరవైమందిని ఎంపిక చేసి అమెరికాలోని అయోవా యూనివర్సిటీకి పంపారు.

ఆ విధ ంగా నేను 1960కల్లా మాస్టర్స్ పూర్తి చేశాను. అరవైలోనే తిరిగి వచ్చేసి యూనివర్సిటీలో రీడర్‌గా చేరిపోయాను. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నానేగానీ, నా మనసు నా చదువు మీదే ఉండేది. మూడేళ్లలోపే మళ్లీ అయోవా యూనివర్సిటీలో చేరిపోయి నాలుగేళ్లకు పీహెచ్‌డీ పట్టానందుకున్నాను. అప్పుడు వచ్చి ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పడంలో లీనమయిపోయాను. దానితో పాటే చీఫ్‌వార్డెన్‌గా కూడా వ్యవహరించేవాణ్ని.

ఆర్.ఇ.సి. పగ్గాలు చేపట్టాను
రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించిన ప్రాజెక్టులు, కర్మాగారాల నిర్మాణానికి అవసరమైన ఇంజనీర్లను మనమే తయారుచేసుకోవాలని నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ భావించారు. దానికోసం దేశాన్ని నాలుగు జోన్‌లుగా తీసుకొని ఒకో జోన్‌లో రెండేసి చొప్పున అత్యున్నత ప్రమాణాలతో ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభించారు. వాటిలో మొట్టమొదటిది వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఆర్ఇసి). దాన్ని నెహ్రూ స్వయంగా తన చేతుల్తో '59లో ప్రారంభించారు. అంత ఉదాత్త లక్ష్యంతో ప్రారంభించిన ఆర్ఇసిలో ఒక దశలో విద్యార్థుల్లో క్రమశిక్షణ తగ్గుతూ వచ్చింది.

ఆ ప్రాంగణంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి వచ్చేసింది. వాళ్లను అదుపు చెయ్యడానికి ఆర్మీ అధికారి కృపలానీని ప్రిన్సిపాల్‌గా నియమించింది ప్రభుత్వం. అతను ఆర్మీ తరహాలో వారిని కట్టడి చెయ్యాలని ప్రయత్నిస్తే, విద్యార్థులు మరింతగా చెలరేగారు. అలాంటి వాతావరణంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌సీ శరీన్ 'హౌస్ ఈజ్ ఆన్ ఫైర్..' అని వార్త పంపి నన్ను వచ్చెయ్యమన్నారు. రెండు నెలలు సమయం అడిగితే, 'రెండు వారాల్లో వచ్చేసెయ్' అన్నారు. అలా వరంగల్ ఆర్ఈసీకి ప్రిన్సిపాల్‌గా నేను పగ్గాలు చేపట్టాను.

కష్టపడి పట్టాల మీదికెక్కించాను
వరంగల్ ఆర్ఇసి గోడనానుకుని ఉండే ప్రాంతంలోనే కొండపల్లి సీతారామయ్య, సత్యమూర్తి వంటివారు మిషనరీ స్కూళ్లలో పాఠాలు చెప్పేవారు. మా విద్యార్థులు వారిని కలిసి, ప్రసంగాలు విని ఉత్తేజితులై కొత్త భావజాలంతో వచ్చేవారు. అందువల్ల కాలేజీలో క్రమంగా ఆర్ఎస్‌యు (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్), పీడీఎస్‌యు వంటివి చాలా బలపడ్డాయి. వీటికి దీటుగా ఆర్ఎస్ఎస్ ప్రాబల్యమూ పెరిగింది. రెండు రకాలవాళ్లూ చాలా దృఢమైన ఆలోచనలతో అభిప్రాయాలతో ఉండేవారు. ఇద్దరూ విడివిడిగా బీదాబిక్కీకి సాయం చేసేవాళ్లు. కానీ క్యాంపస్‌లో ఎప్పుడే అభిప్రాయ భేదాలు తలెత్తి ఎలా గొడవలుగా రూపాంతరం చెందుతాయో అనేలాంటి పరిస్థితి ఉండేది. అంతకుముందున్న అరాచక పరిస్థితి వల్ల కాలేజీకి కేంద్ర నిధులు రావడం ఆగిపోయాయి.

నేను వెళ్లేసరికి అప్పులవాళ్లంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చుట్టూ తిరుగుతూ కనిపించారు. విద్యార్థులు మెస్ బిల్లులు ఏడాదిగా కట్టడం మానేశారు. వారికి కాస్త గడువిచ్చి ఆర్నెల్లలో అన్ని బకాయిలనూ వసూలు చేశాం. శరీన్‌గారితో మాట్లాడి పరిస్థితిని కాస్త చక్కదిద్దేసరికి నిధులు వచ్చాయి. దాంతో పాత అప్పులు తీర్చి కాలేజీని పట్టాల మీదికెక్కించాను.

ఒక వారంలోపే ఆర్ఈసీ 'లేడీస్ క్లబ్' వాళ్లొక ఫంక్షన్ పెట్టుకున్నారు. అధ్యాపకులందర్నీ కుటుంబాలతో సహా పిలిస్తే వెళ్లాం. ఈ కార్యక్రమం నడుస్తుండగానే దూరంగా నినాదాలు వినిపించాయి. అది అక్కడ మామూలే అని మేమెవ్వరం పట్టించుకోలేదు. నెమ్మదిగా అవి మాకు చేరువయ్యాయి. ఆర్ ఎస్‌యు వాళ్లు వచ్చి టీచర్లను చుట్టిముట్టి దూషించడం మొదలెట్టారు. నేనే వారి ధ్యేయమని స్పష్టమయిన తర్వాత టీచర్లంతా నా చుట్టూ ఒక వలయంగా ఏర్పడి కారుదాకా నెట్టుకుంటూ వచ్చి కారె క్కించేశారు.

నా కారు కదిలింది, గొడవ వెనకబడింది. హఠాత్తుగా నాలో ఏదో తెలియని భావం ఉప్పొంగింది. ఎన్నాళ్లీ గొడవలు, ఇదేదో తేలిపోవాలి, నేను ఏమయిపోయినా పర్లేదు అనిపించింది. వెంటనే కారాపి దిగి 'రండి మాట్లాడుకుందాం, ఇదేదో ఇవాళే తేల్చుకుందాం' అని గట్టిగా అరిచాను. ఏమనుకున్నారో ఏమో, వాళ్లు నావైపు నాలుగడుగులు వేసి, తర్వాత వెనుదిరిగి నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఆరోజు వాళ్లు ముందడుగేసి కొడితే ఏమయిపోయేవాణ్నో చెప్పలేను.

అయితే ఈ సంఘటన తర్వాత ఇక గొడవలే లేవంటే నమ్మండి. అధ్యాపకుల్లో, వారి కుటుంబాల్లో అందరిలో భద్రతాభావం పెరిగింది. అప్పుడు ఆ దాడికి నాయకత్వం వహించిన పీడీఎస్‌యు విద్యార్థి తర్వాత ప్రపంచ బ్యాంకులో ఉన్నతోద్యోగంలో కుదురుకున్నాడు. అప్పటి ఆర్ఎస్‌యుకు సారధ్యం వహించిన జనార్దన్ అనే విద్యార్థి పోలీసు కాల్పుల్లో మరణించాడు. ఇది తల్చుకున్నప్పుడు మాత్రం నాకు బాధగా ఉంటుంది. వేడి రక్తం ఉన్న విద్యార్థులతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తేనే మేలు జరుగుతుందని నా నమ్మకం. అందుకే వాళ్లడిగే ప్రశ్నలకు, లేవనెత్తే సమస్యలకు అన్నిటికీ లాజికల్‌గా సమాధానాలిచ్చే ప్రయత్నం చేసేవాడ్ని. అవగాహనాపూర్వకంగా మాట్లాడితే వాళ్లూ అర్థం చేసుకునేవారు. నన్ను వేలెత్తి చూపడానికి ఏమీ లేకుండా చేసుకున్నాను. పదహారేళ్ల పాటు నేను ఆర్ఈసీ ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. వరంగల్ ఆర్ఈసీ అంటే దేశవ్యాప్తంగా పేరుప్రతిష్టలు వచ్చాయి.

ఫెయిల్యూర్లూ ఉన్నాయి...
మా పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. ఏడాదికోసారి నేను అక్కడికి వెళ్లినప్పుడు నా పూర్వ విద్యార్థులు చిన్నచిన్న 'గెట్‌టుగెదర్లు' ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు చాలా బ్యాచ్‌లు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానిస్తుంటారు. అప్పట్లో నేను వాళ్లకు ఎలాంటి పనిష్మెంట్లు ఇచ్చానో గుర్తు చేసి మరీ నవ్వుకుంటారు. వాళ్లతో కలిసి ఒక డ్రింక్ సేవిస్తే చాలు... ఎంతో సరదా పడిపోతారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అప్పట్లో వారివి కేవలం సైద్ధాంతిక విభేదాలే. ఇప్పట్లాగా కులం, ప్రాంతం వంటి అంశాల మీద విద్యార్థులు మాట్లాడుకునేవారే కాదసలు.

నేను పనిచేసిన కాలంలో ఏ అపజయాలూ లేవా అని మీరు అడగొచ్చు. ఉన్నాయ్! వరంగల్ ఆర్ఈసీని ఒక డీమ్‌డ్ యూనివర్సిటీ స్థాయికి తీసుకు రావాలని నేను బలంగా కోరుకున్నాను. అది అవలేదు. ఇప్పుడు దాన్ని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'గా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా నేను కలలుగన్న స్థాయి వచ్చినట్టే, కానీ చాలా ఆలస్యంగా. ఎన్ని పదవుల్లో ఎంత సమర్థంగా పనిచేసినా, మనస్ఫూర్తిగా పాఠం చెప్పిన తర్వాత చేతులకంటిన సుద్దముక్క పొడిని కడుక్కోవడానికి వెళతాం చూడండి... అప్పుడు మనసు పొందే సంతృప్తిని మాటల్లో చెప్పలేం. నావరకూ నాకు పాఠం బాగా చెప్పినరోజు కడుపు నిండిపోయేది.

ఎమ్‌సెట్ మొదలైంది నాతోనే...
'83లో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఒకసారి కలిశాను. విద్యారంగాన్ని ప్రైవేటుపరం చెయ్యడం గురించి మా అభిప్రాయాలు చాలావరకూ కలిశాయి. దివిసీమ ఉప్పెనప్పుడు విరాళాల కోసం ఎన్టీఆర్, అక్కినేని, జమున అందరూ మా కాలేజీకి వచ్చి ప్రదర్శన ఇచ్చారు. అలా మరికొంత పరిచయం పెరిగింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల విధివిధానాల గురించి ఒక అత్యున్నత స్థాయి కమిటీ వేసినప్పుడు ఎన్టీఆర్ మళ్లీ నన్ను పిలిపించారు. మా సిఫారసుల మేరకు వాటిలో కాపిటేషన్ ఫీజును రద్దు చేసింది ప్రభుత్వం.

కాలేజీల మనుగడ కోసం నిధులివ్వమంటే కాలేజీకి ముప్ఫైనలభై లక్షల రూపాయలిచ్చింది. ఎన్టీఆర్ చాలా మొండి ధైర్యం ఉన్న నాయకుడు. నేటి రాజకీయ నాయకులు అంత గట్టి నిర్ణయాలు తీసుకోలేరు. అలాగే ఇంటర్మీడియెట్ తర్వాత ఎమ్‌సెట్‌ను ప్రవేశపెట్టాలన్న ఆలోచనను నేనాయన ముందుంచినప్పుడు 'గో అహెడ్' అన్నారు. దానివల్ల విద్యార్థులు తమకిష్టమైన కాలేజీలను ఎంచుకునే సదుపాయం ఏర్పడింది. అలాగే కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 'గేట్' ఉండాలని దాని విధివిధానాలను రూపొందించాం.

నాణ్యత ఏదీ?
రిటైరయ్యేనాటికే నాకు చదవడం కష్టంగా ఉండేది. జన్యుపరమైన లోపాల వలన రెటీనా క్షీణించిపోయి ఐదారేళ్లుగా నా కంటి చూపు పూర్తిగా పోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య స్థితిగతులు చెప్పమంటే ఏం చెప్పేది? రాష్ట్రంలో సుమారు ఏడు వందల కాలేజీలున్నాయి. కొన్నిచోట్ల సీట్లే భర్తీకాని పరిస్థితి. చేరుతున్న విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చెయ్యగలిగిన నాణ్యత ఉన్న అధ్యాపకులు తక్కువ. కాలేజీలు ఎంతసేపూ పీహెచ్‌డీ ఉందా, ఎన్ని పేపర్లు పబ్లిష్ చేశారన్నదానినే చూస్తున్నాయి తప్ప బోధనలో నాణ్యతను గమనించడం లేదు.

దానివల్లే దొంగ పీహెచ్‌డీలు, కాపీలు పెరిగిపోతున్నాయి. పీహెచ్‌డీ అని వచ్చినవారు ఫండమెంటల్ ప్రశ్నలడిగితే చెప్పలేకపోవడం నేను గమనించాను. ఇది నాకు ఆవేదన కలిగిస్తోంది. టీచింగ్ అంతా కంప్యూటర్ల ఆధారంగా నడవటం అంత మంచిది కాదు. కానీ ఐఐటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. టీచింగ్‌లోనే కాదు, ఏ రంగంలోనైనా సమగ్రమైన అధ్యయనం, పునాదులు బలంగా ఉన్నవారు తక్కువయిపోతున్నారు. అలాగే ఏ విషయానికయినా గట్టిగా నిలబడే తత్వం సమాజంలో తగ్గిపోతోంది.

సేకరణ : అరుణ పప్పు, విశాఖపట్నం.
ఆంధ్రజ్యోతి - ఆదివారం (24-7-20110
........................................................

కొత్త కోటేశ్వరరావుగారి సెల్ : 89850 81516

2 కామెంట్‌లు:

  1. THE REVOLUTIONARY STUDENTS UNION , LEADER , JANARDHAN ,WAS MY BROTHER .I HAVE ALSO STUDIED ENGG.AT REC , WARANGAL AND COMPLETED IN 1969 .THEN JANARDHANA RAO JOINED ,RECW IN 1970 . I HEARD A LOT ABOUT Dr.K KOTESWARA RAO GARU AND MET HIM ON COUPLE OF OCCASIONS WHEN HE WAS THE PRINCIPAL OF RECW , AFTER THE KILLING OF OUR BROTHER JANARDHAN BY POLICE IN 1975 . LATER I HAD CONVERSATION WITH HIM ON PHONE IN CONNECTION WITH BRINGING UP A MEMORIAL BOOK ON JANARDHANA RAO.HE READILY GAVE AN INTERVIEW AT HIS HOUSE TO SRI CHALASANI PRASAD WHICH WAS INCLUDED IN THE MEMORIAL BOOK ON JANARDHANA RAO .PROF.KOTESWARA RAO WAS A HUMANE AND WAS AN ABLE ADMINISTRATOR LIKED BY ONE AND ALL . S P MOHANA RAO .

    రిప్లయితొలగించండి
  2. Prof. K Koteswara Rao, is a teacher par excellence, a passionate professional to the core, an institution builder who steered technical education in Andhra Pradesh and an accomplished administrator, who made REC Warangal a premier institution of the country. The respect he derived from his peers and public, the love and affection of his pupils and his contributions to technical education in the country speaks of his stature. He was a great visionary and a humanist who greatly influenced the lives of many.

    A pioneer with matchless courage and superlative intellect, Prof. K. Koteswara Rao is a towering personality in the field of Technical Education who fostered the vision for engineering education in the country and the state of Andhra Pradesh in particular. He has learned to admire but not to envy, to follow but not to imitate, to praise but not to flatter, and to lead but not manipulate. NIT Warangal (formerly RECW) is fortunate to have one such visionary who strode like a colossus in its glorious history. His driving ambition and innovative abilities impacted the lives of many, and his most significant contribution was undoubtedly his early and clear vision of engineering education. Dedication became a magnificent obsession of a lifetime. He led by being one of the finest examples of a true professional in higher education. The admiration and reverence of the students bring alive memories and passionate stories that they treasure and narrate with a view to benefit the future generations.

    రిప్లయితొలగించండి