13, మే 2011, శుక్రవారం

త్రిపురనేని గోపిచంద్ Tripuraneni Gopichand


త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది  , సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

జీవిత క్రమం

  • 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.
  • హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.
  • 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
  • ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
  • 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
  • తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం(1943).
  • 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు.
  • 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
  • 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందు ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
  • 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.

రచనలు

నవలలు

వాస్తవిక రచనలు

తెలుగు సినిమాలు

త్రిపురనేని గోపిచంద్





గోపీచంద్ శత జయంతి జరుపుతున్నారు.అసలు గోపీచంద్ ను మరచిపోతున్నారు.త్రిపురనేని గోపిచంద్ 1937 నుండి రచనలు అనువాదాలు మొదలు పెట్టారు.తండ్రి త్రిపురనేని రామస్వామి ప్రభావం అతనిపై అప్పటికే వున్నది. దేశంలో ఎం ఎన్ రాయ్ వచ్చి అటు గాంధేయ మితవాదానికి ఇటు కమ్మ్యూ నిస్త్ అతి వాదానికి మార్గాంతరం గా పునర్ వికాసం ,శాస్త్రీయ ముగా చరిత్రను రాయడం ,పునర్ వికాసం ,నూతన రాజ్యాంగం ,వికేంద్రీకరణ ప్రచారం చేసాడు .అది గోపిచంద్ ను ఆకట్టుకున్నది .అమ్రుత బజార్ పత్రికలో రాయ్ వ్యాసాలు అనువదించి ప్రచురించాలంటే ఎవరు ముందుకు రాలేదు. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజా మిత్ర సాహసం తో వాటిని ప్రచురించింది 1937-38 లో. రాయ్ ప్రభావంతో గోపిచంద్ రాజకీయ కథలు రాసి కొత్త దారులు చూపారు .పట్టాభి సోషలిజం ,మార్కిజం అంటే ఏమిటి రాసారు .రాజకీయాలో కొత్త దారులు తొక్కాలని రాయ్ పెట్టిన రాడికల్ డెమొక్రటిక్ పార్తీకి గోపిచంద్ కార్యదర్సిగా ఉపన్యాసాలు ,శిక్షణలు ఇచ్చారు .అసమర్ధుని జీవయాత్ర రాసారు .రచనలలో వ్యంగ్యం ,వాదం ,ఆలోచన ప్రవేశపెట్టారు.తండ్రి చనిపోయిన తరువాత ,1946 లో మద్రాస్ లో సినిమా రంగం లో అడుగుపెట్టి ,మారిపోయారు .అసలు గోపీచంద్ ఆగి పోగా ,ఆధ్యాత్మిక ధోరణిలో రచనలు చేస్తూ ,వివిధ వుద్యోగాలలో వుంటూ ,52 ఏళ్ళకే చనిపోయారు .

ఆయన ఒక మహా చైతన్య స్రవంతి
ఆంధ్రప్రభప్రతినిధి -   Mon, 7 Sep 2009
ఆయన్ని అనేక మంది అనేక విధాలుగా వర్ణించారు. కథక చక్రవర్తి అన్నారు. నవలా సామ్రాట్‌ అన్నారు. తాత్విక సత్యాన్వేషి అన్నారు. రచనా విప్లవ స్రష్ట అన్నారు. ఉన్నదున్నట్లు మొహాన అనగలిగిన సాహసికుడు, చేయి చాచక కలాన్ని కుంచించక అకుంఠిత ఆత్మస్థైర్యంతో బ్రతికిన ధీరోదాత్తుడని శ్లాఘించారు. ఆధునిక సాహితీరూపాలలో అన్నిటా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ, క్రొత్త ప్రయోగాలు చేస్తూ, పాఠకులను శ్రోతలను ప్రేక్షకులను ఉర్రూత లాగించిన సిద్ధ సంకల్పుడని, బహుముఖ ప్రజ్ఞాశాలియని, మహా మనీషియని అంజలి ఘటించారు.

కాని ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా ఒక్క మాటలో చెప్పగలిగిన ప్రత్యేకత పరరాష్ట్రీయుడైన దీక్షిత్‌ గారికొక్కరికే దక్కింది. ఆయన ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం డైరెక్టర్‌గా పనిచేసి, ప్రమోషన్‌ మీద బదిలీ అయిన సందర్భంలో ఈ కేంద్ర బృందంలో ముఖ్యులను గురించి పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ, ''గోపీచంద్‌ను గురించి ఎంతని చెప్పను? ఆయన ఒక మహా చైతన్య స్రవంతి'' అన్నారు.

వంగడంవాసి

ఈ చైతన్య స్రవంతి జననం 1910 సెప్టెంబరులో వినాయక చవితినాడు కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లిలో.

''కవిరాజు'' బిరుదునొంది, గజారోహణాది ఘనసన్మాలందిన కవి త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని గురించి విననివారరుదు. స్వార్థపరులైన సాంఘిక నేతలకు ఆటకట్టుగా ఆచార సంప్రదాయక రంగాలలో మహా విప్లవం ప్రజ్వరిల్లజేసిన విప్లవ కవి. అట్టి తండ్రికి ప్రథమ పుత్రుడుగా గోపీచంద్‌ అల్లారుముద్దుగా పెరిగారు. తెనాలిలో వారి గృహనామం ''సూతాశ్రమం''

ఒక వైపు కొమ్ములు తిరిగిన పండితులు రామస్వామి చౌదరి ''పచ్చి నిహిలిస్టు'' అని అక్కసుతో నిందిస్తున్న ఆ కాలంలో సంస్కార భావుకులందరికీ సూతాశ్రమం, కవిరాజూ ఆధునికాదర్శాలకు మారు పేర్లుగా ఆత్మీయంగా పరిఢవిల్లడం జరిగింది. అలాంటి వాతావరణంలో, కేంద్ర స్థానంలో మసలిన గోపీచంద్‌ వివిధాధునిక భావాలచే, భావుకులచే ప్రభావితులయ్యారు. హైస్కూలు విద్యార్థిగా ఉన్నప్పటినుంచే నవీనాంధ్ర సాహిత్యపఠన, అధ్యయనం విరివిగా చేసేవారు. సూతాశ్రమ వాతావరణంలో గరికపోచా, గాలీ కూడా ''ఎందుకు? ఏమి? ఎటు?'' అని ప్రశ్నిస్తూంటాయని, కవిరాజుగారి ప్రభావం అలాంటిదని పెద్దలంటూండేవారు. అలాంటి వాతావరణంలో పెరిగిన గోపీచంద్‌గారిలో హేతువాదదృష్టి వేళ్లూదుకోవడంలో ఆశ్చర్యంలేదు. కాని అటు కవిరాజుగారి శిష్యులం అనుకునేవారికీ, ఇటు తద్‌ వ్యతిరేకులకూ కూడా ఆశ్చర్యం కలిగించే వ్యక్తిత్వాన్ని గోపీచంద్‌ సంతరించుకున్నారు.

పండిత పుత్రుడనేపడకుండా తప్పించుకోవడమేగాక కవిరాజుగారి పద్ధతినే అనుసరిస్తాడనుకున్నవారికాశాభంగం కలిగించి, పాతపురాణాలూ ఆచార సంప్రదాయాల మీద ధ్వజమెత్తినట్లు కనిపించకుండానే, గతి తార్కిక భౌతిక హేతువాదాన్ని పెంపొందించుకున్నారు. తన ఈ ప్రత్యేక దృక్పథంతో ప్రతి విశేషాన్నీ పరిశీలిస్తూ సువిశాల భావుకతను పండించుకున్నారు.

ఆ కాలంలో తమ మానసిక ప్రవృత్తిని గురించి గోపీచంద్‌ తరచుగా ఇలా చెప్పేవారు. ''నాన్నగారి మూర్తీ, ముఖకవళికలూ, వాక్పటిమా అభిమానుల్ని సైతం ఆశ్చర్య చకితుల్ని చేసి, వారేంమాట్లాడినా నోరు మెదపకుండా ఆకట్టేవి. ఇక వ్యతిరేక భావుకులున్నారంటే వారికి తెలియని ఏ పురాణాంశాలు పట్టుకుని నాన్నగారు దులిపేస్తారో, ఆ వాదన వెనుక ఎంత పటిమా ప్రోద్బలం ఉంటాయోనని భయవిహ్వలత చెందేవారు. సూతాశ్రమంలో జరుగుతున్న చర్చలమధ్యగాని, నాన్నగారు ఉపన్యసిస్తున్న సభలలోగాని 'ఏల? ఎందుకని?' అనే ప్రశ్నలు వేసేవాళ్లలో నేనే ముఖ్యుణ్ణి. మొత్తం మీద ఆయన ప్రభావంవల్లనే ప్రశ్నించే ధైర్యం కలిగి, వారి సమాధానాల వల్లనే నా ఆలోచనా పరిధి పెరుగుతూవచ్చింది. నాన్నగారు ప్రత్యేకంగా పట్టించుకోని ఆధునిక భావుక గ్రంథాలను స్వశక్తితో అధ్యయనం చేసి సమన్వయించుకునేవాణ్ణి. నాన్నగారు చేపట్టిన ఉద్యమానికి అలాంటి నాయకత్వమే అవసరం అవుతుంది. ఆ పరిస్థితుల్లో వారు పూర్ణ పురుషులయ్యారు. మరి వారి ఉద్యమం ఫలించినా తరువాతి కాలానికి అవసరాల్లో మార్పువస్తుంది కదా? ఆ మార్పువల్ల ఏర్పడిన క్షేత్రం, దానికి తగిన విత్తనం ప్రోది ఎలా ఉండాలనేవే అప్పటి నా ఆలోచనలు''.

దీన్నిబట్టి గోపీచంద్‌ అటు పండితపుత్రుడుగా గాని, ఇటు మహావృక్షం చాటు మొలకగా గానే ఉండిపోక ప్రత్యేకవ్యక్తిత్వాన్ని ననలు సాగించుకోవడానికి ఆదినుంచే ఎంత జాగ్రతపడ్డారో, ఎంత కృషిచేశారో మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఎప్పటికప్పుడు ''పదేళ్ల తరువాత ఏమిటి? ఏది? ఎలా?'' అనే ధోరణిలో ప్రగతి పథాన పయనించడానికి గల ఆలంబనం కూడా మనం అర్థం చేసుకోగలం.

పట్టాభిగారి సోషలిజం:

గోపీచంద్‌ గుంటూరు ఎ.సి. కాలేజీలో చేరేనాటికి దేశంలో జస్టిస్‌ పార్టీ ప్రాబల్యంలో ఉంది. కాని కాంగ్రెస్‌ సంస్థ మరింత ఉరవడిగా, ఇంకింత విశాలంగా ప్రజా హృదయాలను ముంచెత్తగలిగే జవాన్ని పుంజుకుందని యువకులు కూడా గుర్తిస్తున్నారు. కాంగ్రెసులో వామపక్షంగా ఉన్న స్వరాజ్య పార్టీ నాయకులు విద్యావంతుల, యువకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఆకాలంలో స్వర్గీయ పట్టాభి సీతారామయ్యగారు రాష్ట్ర కాంగ్రెసు పెద్దలుగా సోషలిజాన్ని గురించి విపరీత వ్యాఖ్యానాలు చేస్తూ, తీవ్రవాదులను చులకనజేయ ప్రయత్నించారు.

గోపించద్‌ ఈ అసమగ్రవాద విమర్శలను సహించలేకపోయారప. ఇలాంటి విమర్శకులు మహానాయకులుగా చెలామణి అవుతుంటే ''దేశం ఏమయ్యేట్టు?'' అని బాధపడడం కూడా ప్రారంభమయిందని వారు చెప్పేవారు. ఈ ఆవేదనతో ''పట్టాభిగారి సోషలిజం'' అనే ప్రతి విమర్శక వ్యాసం వ్రాసి గ్రంథరూపంగా ప్రచురించి యువకుల, అతివాదుల దృష్టి నాకర్షించి ప్రభావితం చేశారు. గ్రంథరూపంగా వెలువడిన గోపీచంద్‌ ప్రథమ రచన ఇదే. అప్పటికే ''గీతాపారాయణం'' మున్నగు కథలు కొన్ని పత్రికల్లో ప్రచురించబడ్డా గ్రంథరూపాన రాలేదు. ఆయన రచనల్లో పునః ముద్రితం కాని వేవీ లేవు. కాని ప్రథమ గ్రంథానికి (పట్టాభిగారి సోషలిజం) మాత్రం అలాంటి శాశ్వతత్వం చేకూరలేదు. బహుశా తాత్కాలిక ప్రయోజనానికే పరిమితమైన పట్టాభిగారి దుందుడుకు ప్రసంగాలను ఖండించే రచన కావడం వల్లనే ఇలా సంభవించి ఉంటుంది. ఈ ప్రసక్తి వచ్చినప్పుడు గోపీచంద్‌ ''అందుకు ఆమ్రేడితం అఖ్కర్లేదనుకున్నా''ననేవారు.

రాయిస్టుగా:

దాదాపు ఇదే సంధిసమయంలో రష్యా, చైనా కమ్యూనిస్టు పార్టీలలో ప్రముఖ కార్యకర్తగా పనిచేసి మాతృదేశం తిరిగివచ్చిన ఎం.ఎన్‌.రాయ్‌ అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు కావడం, మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌లు నిర్వచించిన భౌతికవాద గతులను మించి నవ్యమానవతావాదానికి ప్రాతిపదికలు ప్రతిపాదించడం జరిగాయి. రాయ్‌ విశేష వాదనాపటిమ, నవ్యనిర్వచనావళి, ప్రతిభా వ్యత్పత్తులు అధికవిద్యావంతుల్ని, మేధావంతుల్ని బాగా ఆకర్షించాయి. నిత్య సత్యాన్వేషి ఐన గోపీచంద్‌కు ''దేశం ఏమయ్యేట్టు?'' అనే ప్రశ్నకు రాయ్‌ ప్రతిపాదనల్లో మంచి ఆలంబనం దొరికింది. రాయ్‌ వ్యాసాలు, గ్రంథాలు అధ్యయనం చేసి, ఆయనతో చర్చలు జరిపి రాజకీయరంగం మీద శ్రద్ధను పెంచుకున్నారు. ఇంతలో లా చదివి, న్యాయవాదిగా కోర్టులో ప్రవేశించారు. కాని న్యాయవాద వృత్తిమీద ఆయనకు అభిమానం నిలవలేదు. తండ్రిగారు బార్‌ఎట్‌లా అయీ ప్రాక్టీసు చెయ్యలేదు. గోపీచంద్‌ బి.యల్‌. అయీ ఆ వృత్తిని కొనసాగించలేదు. ఈ విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ ధనసముపార్జనా దృష్టిని త్యజించినందు వల్లనే మన తెలుగు సారస్వతానికీ, ఆలోచనా ధోరణులు అభ్యుదయగతికి మరలించడానికీ అసమాన సేవ చేయగలిగారని చెప్పుకోవాలి.

''న్యాయవాదవృత్తి మనకు నప్ప''దని నిర్ణయించుకోగానే గోపీచంద్‌ రాయిస్టు రాజకీయాలలో ప్రముఖ పాత్రను నిర్వహించడానికి మళ్లారు. సూతాశ్రమానికి తిరిగివచ్చి కథానికా సృష్టిని ద్విగుణీకృతం చేశారు. కాంగ్రెస్‌ అగ్రనాయకుల ధోరణికి తలూపలేకపోయినా ఎం.ఎన్‌.రాయ్‌ రాడికల్‌ డెమోక్రటిక్‌ పార్టీని ఏర్పాటుచేశారు. ఆ పార్టీ ఆంధ్రశాఖకు గోపీచంద్‌ ప్రముఖ కార్యకర్తగా పనిచేసి, కార్యదర్శి కూడా అయ్యారు. అంతగా రాజకీయాల్లో పనిచేసే కాలంలో కూడా ఆయన సభికుల్ని సమ్మోహితుల్ని చేసే వక్త కాలేదు. కాని ఆయన కథలలో వలెనే ఉపన్యాసాలలో కూడా చక్కని వాడుకభాష, భేషజంలేని వివరణ, వాదనాపటిమ, సత్యదృష్టి ఆలోచనాపరులను పూర్తిగా ఆకట్టుకునేవి. అందువల్ల ఉపన్యాసం వినేప్పుడే చప్పట్లూ సముత్సాహాలూ ప్రదర్శించకపోయినా సభికులు సమీక్షించుకుని, చర్చించుకున్న కొద్దీ గోపీచంద్‌ ప్రతిభకు జోహారులర్పించేవారు. రాడికల్‌ పార్టీ కార్యదర్శిగా గోపీచంద్‌ అనేక మంది ఆంధ్ర విద్యావంతుల్నీ రైతుబిడ్డల్నీ హేతువాదుల్నిగా తయారుచేశారు. రాజకీయ కార్యకలాపాలలో ప్రత్యక్షంగా పాల్గొనక, సిద్ధాంతాల ప్రచారం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటే అంతగా ప్రయోజనం ఉండదని భావించి ఆయన క్రమంగా పార్టీ ప్రసక్తి తగ్గించుకుంటూ, తమ ఆలోచనాపరిధిని పెంచుకుంటూ పోయారు. ఈ విధంగా ఆయన రాడికల్‌ పార్టీకి దూరమైనా, అంతకుముందే ఆయన సత్యవాదనాధృతికి సమ్మోహితులైనవారు వందలాదిగా పార్టీ అభిమానులు, కార్యకర్తలుగానే ఉండిపోయారు. గోపీచంద్‌ నిర్విరామచైతన్య ప్రవృత్తికి తగిన రాజకీయ పక్షం మరేదీ దేశంలో లేదు. హేతువాద సంచలనాత్మకమైన రాయిస్టు పక్షమే ఆయన పరిధికి చాలలేదంటే, మరోపక్షం ఆయన్నెలా ఆకర్షించగలదు? ఈ కారణంగానే ఆయన తనకుతానుగా ఆలోచనా పరిధిని, జ్ఞాన సముపార్జనాత్రపను పెంపొందించుకుంటూ నిత్యచైతన్య స్రవంతిగా రూపాంతరం చెందసాగారు.


- పోలవరపు శ్రీహరి రావు

సాహిత్యాభిమానులకు శుభ వార్త :
త్రిపురనేని గోపిచంద్ రచనా సర్వసం - పది సంపుటాలు ఒకే సెట్‌గా
అందుబాటులోకి వచ్చాయి.
విడిగా కూడ లభ్యం. ప్రచురణ కర్త వివరాలు:
అలకనంద ప్రచురణలు
Ashok Book Center
Opposite Maris Stella College,
Ring Road, Vijayawada,
Andhra pradesh 520008‎ -
పోన్: +91 (0866) 2472096
email:vjwabcbo...@sancharnet.in
 *
Akshara‎Address:
M/s. AKSHARA BOOK STORE ,
P NO 5, BANJARA HILLS, UBI Colony,
near TRENDSET TOWERS,
RD NO 3,Banjara Hills,
Hyderabad - 500034
Ph: +91 (40) 23554096
*
Akshara Book Center
Block G-4, Creative Kamal Complex,
West Maredpally, Hyderabad 500026,
Andhra Pradesh
పోన్: +91 (40) 27804626
*
Ashok Book Centre
13-1-1c, St Anthony Church Compound
Apsara Road, Vishakhapatnam - 530002
Andhra Pradesh
ఫోన్; +91 (0891) 2561055, 2565995
ప్రముఖ పుస్తక దుకాణాలలో కూడా దొరుకుతవి

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి