13, మే 2011, శుక్రవారం

నాగభైరవ కోటేశ్వర రావు Nagabhyrava Koteswara rao



స్పష్టత, సుందరత, సమగ్రత,
సజీవతల సాహిత్యశిల్పి నాగభైరవ
నిన్నమొన్నటి వరకు ఐక్యత
నెన్నుకొని, ఈనాడు విభజన
కోరుకొను ఆంధ్రాళి చర్యకు
కోపమును వహియించు ప్రకృతి
అసమ్మతికి సూచకముగా యీ
ఆర్భటిని చూపించెనేమో
ఈ పంక్తుల్లో ఏముందో ఇప్పుడు ఎవ్వరికీ ప్రత్యేకించి వివరించనక్కరలేదు. ''కన్నీటి గాథ'' అనే కావ్యంలో డా. నాగభైరవ వెలిబుచ్చిన అభప్రాయమిది.
అమ్మాయిల నబ్బాయిల కూచోబెట్టి
సెన్సారేలేని టెక్‌స్ట్‌ చేతిలో పెట్టి
శృంగారం చెప్పమంటే ఎంత కష్టము
తెలుగు మాస్టారవ్వడమె దురదృష్టము...
నిజమే! ఆయన తెలుగు మాస్టారే... పద్య కావ్యాలు, గేయకావ్యాలు వచన కవితా సంపుటాలు, పలు రూపకాలు, చలనచిత్రాలకు కథ, సంభాషణలు, పాటలు.. ఇలా ఎన్నోవిధాలుగా తెలుగు సాహిత్యాన్ని పండించిన కృషీవలులాయన! పత్రికల్లో శీర్షికలు నిర్వహించినా, సంపుటాలకు ముందుమాట రాసిన అంత కవితాత్మకంగా మరొకరికి రాయడం సాధ్యం కాదనిపించుకొన్న సాహితీ భైరవులు నాగభైరవ కోటేశ్వరరావు.
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం (ఒకప్పుడా గ్రామం గుంటూరు జిల్లాలో భాగం)లో 1931 ఆగస్టు పదిహేనో తేదీన వెంకట సుబ్బారావు, రాఘవమ్మ దంపతులకు జన్మించారు నాగభైరవ. రావినూతల సత్యనారాయణ నాగభైరవకు గురుతుల్యులు. ఆయనే అక్షరాలపట్ల మమకారం కలిగించారు. అందుకే నాగభైరవ తల్లిదండ్రుల తర్వాత ఆయనకే నమస్కరిస్తారు. రావినూతలలో ప్రాథమిక విద్యానంతరం ఒంగోలు అమెరికన్‌ బాప్టిస్ట్‌ మిషన్‌ ఉన్నత పాఠశాలలో చేరారు. పాఠశాల విద్య పూర్తికాగానే గుంటూరు హిందూ కళాశాలలో చదివారు. అనేక కారణాలవల్ల నాగభైరవ డిగ్రీ, పి.జి... మొదలైనవన్నీ ప్రైవేటుగానే పూర్తిచేశారు. తొలిదశలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడైన కొన్నేళ్లకి ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయుడయ్యారు. ఆ తర్వాత జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకులై పదవీవిరమణ చేశారు. స్వయంకృషికి నాగభైరవ జీవితమే నిదర్శనం. ఆయనకు జీవితంపట్ల స్పష్టమైన అవగాహన ఉంది. తాత్విక చింతన ఉంది. అభ్యుదయ భావన, కామన పుష్కలం. తన సాహితీ జీవితాన్ని గురించి ఆయన ఓ చోట ఇలా అన్నారు - ''నా కవిత్వంలో ఎత్తులే తప్ప లోతులులేవు. ధర్మాలే తప్ప మర్మాలు లేవు. ఇరవై అయిదు సంవత్సరాలుగా తెలుగు కవిత్వం ఎన్నెన్ని మార్పులకు లోనయిందో అన్నిటికీ నిలువుటద్దం నా కవిత్వం. అనుభూతి కవిత్వం నాకు వంటపట్టదు. మానవతా విలువల ఉద్ధరణం, దానవతా విలువలు ఊడబెరకడం ఏ కవికయినా ఆవశ్యకం ఈ ప్రయత్నంలో కొండొకచో నిరాశ చోటుచేసుకుంటుంది. అది నా రచనల్లో కూడా ఉంది. ఇక్కడ దయా పారావతాల కోసం అన్వేషణ ఉంది. విజయ ఐరావతాల కోసం అన్వేషణ ఉంది. వ్యవస్థ కల్పించిన అవస్థలను తప్పించటం కోసం విప్లవానికి ఆహ్వానం ఉంది. లేనిదల్లా మాటల మాటున హిపోక్రసీ''... నిలువెత్తు భారీవిగ్రహం, నోట్లో చుట్ట, కంచుకంఠం ఇలా ఉన్న ఆయన్ని చూసినవారు ఆయనకి హిపోక్రసీ ఉందని అనుకోరు. ఆయన రచనలు చదివితే అసలనుకోలేరు!
పద్యాన్ని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాషువాలవలె లలితంగా, మధురంగా వేమన్నలా నిసర్గసుంరంగా రాయగలగడం నాగభైరవకే చెల్లింది. ఒయాసిస్‌, మానవతా సంగీతం, వెలుతురు స్నానం, తూర్పు వాకిళ్లు, నా ఉదయం - సంతకం - ఇవీ ఆయన వచన కవితా సంపుటాలు. రంగాజమ్మ, గుండ్ల కమ్మ చెప్పిన కథ, కన్నీటి గాథ ఇవీ ఆయన కథా కావ్యాలు. ''మరో అమ్మాయి కథ'' - ఆయన నవల. ఆంధ్రదేశంలోనే కాకుండా దేశంలో అనేక వేదికల మీద, విదేశాల్లో సైతం వందల ప్రదర్శనలకు నోచుకొన్న ''కవన విజయం'' ఆయన అపూర్వ సృష్టి. 'దానవీర' అనే ప్రముఖుల పరిచయ సాహిత్య సంపుటి తెచ్చారు. అలాగే పర్యాయాలు ప్రదర్శితమైంది. ''బ్రహ్మర్షి విశ్వామిత్ర''కు 'భార్గవ్‌' వంటి సీనిమాలకు సాహిత్యం సమకూర్చారు. రుబాయీలు రాశారు. ''చెలిమనసు'' అనే ప్రేమకవితలు రాశారు. ఆయన ఎన్నో చిత్రాలకు గీతాలు కూడా రాశారు. ఇక గ్రంథసమీక్షలు, పత్రికల్లో శీర్షికలకు కొదువలేదు. ''పరామర్శ'' అనే సాహితీ విమర్శ ఆయనదే. నాగభైరవ అందుకొన్న అవార్డులు అనంతం! 1988లో ఉత్తమ అధ్యాపకుడిగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారం, కవిగా సుబ్బరామిరెడ్డి కళాపీఠం అవార్డు, రాజ్యలక్ష్మి - వెంకన్న చౌదరి అవార్డు, గడియారం వేంకటశేషశాస్త్రి అవార్డు, రాజ్యలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు పొందారు. ఇక ఆయన్ని వరించిన పదవులు ఎన్నో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సిండికేటు సభ్యుడయ్యారు. అధికార భాషా సంఘం సభ్యుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా, ఎలిమెంటరీ పాఠశాలల భాషా సిలబస్‌ కమిటీ ఛైర్మన్‌గా, సెన్సార్‌ సభ్యుడిగా, దూరదర్శన్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా... ఇలా ఆయన ఎన్నో హోదాల్లోనూ సాహితీ సేవ చేశారు. డా. నాగభైరవ కథా కావ్యాల మీద పరిశోధన చేసిన డా.వొలుకుల శివశంకరరావు మాటల్లో చెప్పాలంటే - ''1963లో 'రంగాజమ్మ' చారిత్రక గేయకథా కావ్య ప్రకటనతో నాగభైరవ సాహితీ లోకంలో అడుగుపెట్టాడు. తొలికృతి అయినా అపశ్రుతులు లేని కవితా పరిపక్వతతో రంగాజమ్మును రసనిధానంగా నిర్మించి, తన వాణిని, తన బాణిని పాఠకులకు రుచి చూపించారు. అప్పటి నుంచి బహుముఖంగా నాగభైరవ కవితా ప్రస్థానం కొనసాగింది.'' నాగభైరవ పెద్ద ఒంగోలు కొండ. యువకవులకు, కవయిత్రులకు అండ. ఎవరు ఎక్కడ రసాత్మక వాక్యం రాసినా అభినందించే పెద్దమనసు ఆయనది. ఒక దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఎన్నో వారాలు ఆయన నిర్వహించిన యువకవుల పరిచయం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. స్పష్టత, సమగ్రత, సుందరత, సజీవతల మేలు కలయికే నాగభైరవ సాహిత్యం.
                                    చీకోలు సుందరయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి