13, మే 2011, శుక్రవారం

నార్ల వెంకటేశ్వర రావు Narla Venkateswara rao


నార్ల వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
నార్ల వెంకటేశ్వరరావు
జననం డిసెంబర్ 1, 1908
జబల్‌పూర్, మధ్య ప్రదేశ్
మరణం ఫిబ్రవరి 16, 1985
హైదరాబాద్
గుండెపోటు
ఇతర పేర్లు వీ.ఆర్.నార్ల
వృత్తి పాత్రికేయుడు
మతం మానవత్వం
భార్య/భర్త సులోచనా దేవి
సంతానం 3 కుమారులు, 5 కుమార్తెలు
తండ్రి లక్ష్మణ రావు
తల్లి మహాలక్ష్మి
Narla Venkateswara Rao.jpg
నార్ల వెంకటేశ్వరరావు తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్ల గా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాది గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు.

వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించాడు. నార్ల వారి సొంత గ్రంధాలయంలో 20000 పుస్తకాలు ఉండేవట. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లిష్‌లో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రజ్యోతి' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు.ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి,నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు. సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదకశస్త్రాలను ప్రయోగించారు. అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం చేసిన యోధుడాయన.

సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు.రామాయణాన్ని; రామ, రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్యభావజాలానికి సవాలు విసురుతూ 'శంభూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.

ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం 'ఆంధ్రజ్యోతి' ఆవిర్భావం. ' ఆంధ్రప్రభ' నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా 'నిరుద్యోగి'గా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక అది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల 'ఆంధ్ర ప్రభ', 'ఆంధ్రజ్యోతి' ద్వారా సమర్థంగా కొనసాగించారు.తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు. సంపాదకుడు అనే మాట ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు. ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. 'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు.

సెన్సార్ కు సెన్సార్

జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు -జైలులోకి విడుదలచేయబడ్డ ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని —ఆనాటి ఆంధ్రప్రభ సంపాదకులు నార్ల వెంకటేశ్వర రావు గారికి ఉత్తరం రాశారు.తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా వెంకటేశ్వర రావుగారు ఒక రోజు పత్రిక మొదటిపేజీ నిండా నల్లగా తారుపూసి విడుదలచేసారు. అది పత్రికాప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది.

ఇన్నయ్య చెప్పిన విశేషాలు

  • ఎన్.టి. రామారావు నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహా దారుగా నియమించారు.
  • ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ కు నార్లకు అభిప్రాయ భేదాలు వచ్చాయి.రాజీనామా చేశారు.ఆంధ్రజ్యోతి స్థాపనకు ప్రధాన కారకుడు నార్ల. ఆయన్ను చూచి చాలా మంది షేర్లు కొన్నారు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త వరవడులు ప్రవేశపెట్టారు.సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు. ఆయన రాత ఒక పట్టాన అర్థం అయ్యేదికాదు. ఉడయవర్లు అనే జర్నలిస్టు తిప్పలు బడి రాసి పంపేవాడు.
  • తరచు ఆదివారాలు హైదరాబాద్ లో అబిడ్స్ ప్రాంతాన పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు వెతికేవారు.ఆయనకు యీ అలవాటు మద్రాసులో మోర్ మార్కేట్ నుండిఉంది.
  • నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా తాగే సిగరెట్లు అప్పటితో మానేశాడు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు.
  • ఆయనకు త్రిపురనేని రామస్వామి రచనా శైలి నచ్చలేదు. త్రిపురనేని గోపీచంద్ కు ఆయనకూ పడలేదు. గోపీచంద్ ఆపదలో వున్నప్పుడు సహాయపడినా, విశ్వాసం లేదని నార్ల అనేవాడు. కాని గోపీచంద్ చనిపోయినప్పుడు “ఎంత గుండె గలవాడికీ గుండె పోటు” అంటూ గొప్ప సంపాదకీయం రాశారు.
  • నార్ల దగ్గర వుద్యోగం చేసిన తిరుమల రామచంద్ర ఉద్యోగం పీకేశాడు.
  • నార్ల ఏ రాజకీయ వాదినీ వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఆయన కలానికి గురైన వారే. ఎన్.జి. రంగాపై ధ్వజం ఎత్తినప్పుడు, గోగినేని రంగనాయకులు అని పతాక శీర్షికలతో రోజూ ఆయన వార్తలు ప్రచురించేవారు. రంగా బాధపడ్డారు. అమ్మ నాన్న పెట్టిన పేరు వాడితే అంత గింజులాట దేనికి అని నార్ల అనేవాడు.
  • 1954లో ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికల సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తారరాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవులగోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా దెప్పిపొడిచారు. అది బాగా ఆయనకు గుచ్చుకున్నది. వెంటనే గుత్తి కొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. అవి కళ్ళు తెరిపించగా, నార్ల అప్పటి నుండీ రాయ్ అభిమానిగా, క్రమేణా మానవవాదిగా పరిణమించారు.
  • ఎం. చలపతిరావు నార్ల ఇంట్లో వుండేవారు. విపరీతంగా నత్తి వుండేది.
  • నార్లను సభలకు పిలిచినప్పుడు ఆయన ప్రసంగాలు ఆకర్షణీయంగా వుండేవి కావు. విషయం వున్నా, ఆయన సభారంజకుడుకాదు. రచనలలో వున్న పట్టు, ప్రసంగాలలో లేదనిపించేది.
  • వడ్లమూడి గోపాలకృష్ణయ్య, వాఙ్మయ మహాధ్యక్ష అని బిరుదు తగిలించుకొని, విమర్శనా రచనలు చేస్తుండేవారు. ఆయన ఓరియంటల్ తాళపత్ర గ్రంథాల పీఠానికి, డైరెక్టర్ గా వున్నారు. ఎక్కడ పేచీ వచ్చిందో తెలియదు గాని, నార్ల అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతడి సెక్స్ దుర్వినియోగం మొదలు అవినీతి వరకూ బయటపెట్టి వుతికేశారు. మంత్ర శక్తితో ప్రత్యర్థిని నాశనం చేయగలనని బెదిరించే గోపాలకృష్ణయ్య నార్లను తట్టుకోలేక పోయారు.
  • విశ్వనాథ సత్యనారాయణ చాందసాన్ని నార్ల విమర్శించేవారు.
  • నండూరి రామమోహనరావును గుమస్తా సంపాదకుడు అనేవాడు.
  • ఇందిరాగాంధి పట్ల తీవ్ర ద్వేషం పెంచుకున్నారు. ఆమె కుటుంబవారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణను మెచ్చుకునేవారు.
  • నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. శివుడు, కృష్ణుడి పరంగా వచ్చిన కళా ఖండాల్ని కూడా సేకరించారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వాటి విశేషాలు చెప్పేవారు.బౌద్ధానికి చెందిన కళాఖండాలు, మినీ విగ్రహాలు నార్ల సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ ఆడి గినా వారికి యివ్వలేదు.

రచనలు

ఆంగ్ల రచనలు

  1. The truth about the Geetha 1988
  2. An essay on the upanishads 1989
  3. Gods and goblins
  4. East and west
  5. Intellectual poverty in India

నార్ల వారి మాటలు

  • యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.
  • ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.
  • సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.
  • బడు వాడేవాడు బడుద్ధాయి.
తెలుగు పత్రికా నౌకకు దిక్సూచి
- కొండుభట్ల రామచంద్రమూర్తి
తాను నమ్మిన విషయాన్ని శక్తిమంతంగా చెప్పడంలో నార్ల అద్వితీయుడు. ఆయన రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.
శ్రీశ్రీ వంటి మహాకవి శ్రీశ్రీ ముందు ఎవరూ లేరు, ఆయన తర్వాత ఎవరూ లేరంటూ కొందరు చేసిన తీర్మానంపై తర్జనభర్జన జరిగిన సందర్భాలు ఉన్నాయి. నార్ల వెంకటేశ్వరరావు వంటి మేటి సంపాదకుడు ఆయనకు ముందూ, వెనుకా ఎవరైనా ఉన్నారా..! లేరా! అన్న అంశంపైన చర్చ జరిగిన దాఖలా లేదు. తెలుగు పత్రికా సంపాదకునిగా నార్లకు దీటైన వారు ఆయనకు ముందు కానీ, ఆయన తర్వాత కానీ ఎవరూ లేరు. సంపాదక వ్యవస్థను సమున్నత స్థాయిలో నిలిపిన అసాధారణ ప్రతిభావంతుడు నార్ల. ఆయన జీవిత కాలంలోనే సంపాదక వ్యవస్థ ప్రాధాన్యం తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. ఆయన తర్వాత మారిన పరిస్థితులలో సంపాదక మండలి పత్రికా వ్యవస్థలో కేవలం ఒక విభాగంగా, తక్కిన విభాగాలతో సమానంగా కుంచించుకుని వొదిగిపోయి మిగిలిపోయింది.
కనుక తెలుగు రాజకీయంలో నందమూరి తారక రామారావు లాగానే పత్రికా రంగంలో నార్లను ' ఒకే ఒక్కడు'గా అభివర్ణించవచ్చు. పత్రికలు ఉంటాయి. వాటికి సంపాదకులుగా కొందరు నియుక్తులవుతారు. కానీ ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం 'ఆంధ్రజ్యోతి' ఆవిర్భావం. ' ఆంధ్రప్రభ' నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా 'నిరుద్యోగి'గా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక అది. ఆయన ఔన్నత్యానికీ, ప్రాబల్యానికీ నిలువెత్తు నిదర్శనం. స్వాత్రంత్య పూర్వపు సమాజానికీ, స్వాత్రంత్యానంతర సమాజానికీ పటిష్ఠమైన వారధి నార్ల. ఆధునిక భారత ఇతిహాసంలోని చారిత్రక దశలో ఆయన ఒక వెలుగు వెలిగారు.
అటువంటి కాలమాన పరిస్థితులు మళ్ళీ రావు. అటువంటి సంపాదక శిఖరాన్ని మళ్ళీ చూడలేం. నార్లకు ముందు కానీ తర్వాత కానీ ఆయనకు దీటైన సంపాదకుడు లేడని నిర్థారించడం అందుకే. 'ఆంధ్రప్రభ' సంపాదక బాధ్యతలను నార్ల 1942లో స్వీకరించిన నాటికి తెలుగు పత్రిక పుట్టి నూరేళ్ళు వర్థిల్లింది. ముట్నూరి కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, కాశీనాధుని నాగేశ్వరరావు, తాపీ ధర్మారావు, జిఎస్‌ ఆచార్య వంటి మేటి సంపాదకులు తెలుగు పత్రికా రంగాన్ని అప్పటికే సుసంపన్నం చేశారు. ఒక దినపత్రిక సంపాదకత్వాన్ని నిత్య సంగ్రామంగా నిర్వహించి దానికి సమున్నతమైన స్థాయినీ, అసాధారణమైన అస్తిత్వాన్నీ సమకూర్చిన బహుముఖ ప్రతిభాశాలి నార్ల. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. పత్రికా రచనలోనూ, పత్రిక రూపకల్పనలోనూ కొత్త పుంతలు తొక్కి తెలుగు పత్రికా రంగాన్ని మేలు మలుపు తిప్పిన ద్రష్ట ఆయన. శైలిలో, నూతన శీర్షికావిష్కరణలో, పుటాలంకరణలో, సమాచార వితరణలో, రాజకీయ, సామాజిక పరిణామాలపైన సూదంటి వ్యాఖ్యానంలో కొత్తబాటలు వేసిన వైతాళికుడు.
పత్రికా రచనలో సారస్వతపు జిగినీ, నుడికారపు సొగసులనూ, జాతీయాల సౌరభాన్నీ రంగరించిన రసజ్ఞుడు. తెలుగు దినపత్రిక స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేసిన సంపాదకుడు. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల 'ఆంధ్ర ప్రభ', 'ఆంధ్రజ్యోతి' ద్వారా సమర్థంగా కొనసాగించారు. భావి తరాలకు దిశానిర్దేశం చేశారు. 'తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు. తెలుగు పట్ల ఇంతటి మమకారం లేకపోతే కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావులాగా నార్ల కూడా ఢిల్లీకో, లక్నోకో వెళ్ళి ఆంగ్ల పత్రికల సంపాదకుడిగా కీర్తి గడించేవారు. నార్ల బహుముఖీనుడు. స్వాత్రంత్య సమరయోధుడు. పత్రికా రచయిత. కవి. నాటక రచయిత. అనువాదకుడు. పరిశోధకుడు. మేధావి. అత్యున్నత చట్ట సభలో సభ్యుడు. హేతువాది. ఇన్ని రంగాలలో అభినివేశం ఉన్న వ్యక్తి మరొకరు కనిపించరు.
అన్ని రంగాల పైనా తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ప్రజ్ఞాశాలి మరొకరు లేరు. ఒక పత్రికా సంపాదకుడికినిన్ని తేజోవంతమైన పార్శ్వాలను ఊహించడం కూడా కష్టమే. ఎన్ని రకాల సాహిత్య ప్రక్రియలలో నార్ల తన ప్రతిభను చాటుకున్నప్పటికీ తెలుగు పత్రికా రంగానికి ఎనలేని సేవ చేసిన సంపాదకుడిగానే భావితరాలు ఆయనను గుర్తు పెట్టుకుంటాయి. నికార్సయిన పత్రికా సంపాదకుడికి నిర్వచనం నార్ల. సంపాదకుడు (ఆయన ఈ మాట ఉపయోగించేవారు కాదు. ఎడిటర్‌ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్‌ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు) అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.
అన్ని సమస్యలపైనా ఎడిటర్‌కు అవగాహన ఉండాలనీ, నిశ్చితాభిప్రాయం ఉండాలనీ, అభిప్రాయాన్ని నిర్భయంగా, నిస్సంకోచంగా, సూటిగా ప్రకటించాలనీ ఆయన విశ్వాసం. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ సంపాదకీయం రాసినా, అత్యయిక పరిస్థితి విధించడాన్ని నిరసిస్తూ సంపాదకీయం రాయకుండా ఆ స్థానాన్ని ఖాళీగా వదిలి వేసినా, చివరికి యాజమాన్యంతో విభేదాల కారణంగా సంపాదక పదవికి రాజీనామా చేసినా, పూర్వ యాజమానిని దుయ్యపడుతూ జీవిత చరమాంకంలో నిప్పులు కక్కే రచనలు చేసినా నార్లలో స్వతంత్రుడైన (నిరంకుశుడా?) రచయిత దర్శనమిస్తాడు.
హేతుబద్ధంగా ఆలోచించాలనీ, సామాజిక పరిణామాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించాలనీ, మానవతావాదిగా జీవించాలనీ, పురాణాల ద్రుష్పభావం నుంచి ప్రజలను బయటపడేయాలనీ, కుల వ్యవస్థను రూపుమాపాలనీ ఆరాటం. ప్రజలలో భావి విప్లవం రాకపోతే ఎన్ని పంచవర్ష ప్రణాళికలు ఎంత జయప్రదంగా అమలైనా నిజమైన అభివృద్ధి సిద్ధించదని వాదన. తాను నమ్మిన విషయాన్ని శక్తిమంతంగా చెప్పడంలో నార్ల అద్వితీయుడు. ఆయన రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన. 'ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. ఆయనకు సంపాదకత్వం వారసత్వంగా వచ్చింది కాదు.
అహరహం శ్రమించి, కఠోర తపస్సు చేసి సాధించుకున్నది. కష్టించి పని చేసే స్వభావం, వృత్తిపట్ల అపారమైన గౌరవం, గర్వం ఆయనను సమున్నత స్థానంలో నిలిపాయి. 'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించడానికి కారణం అదే. నార్ల నిరంతర అధ్యయన శీలి. సత్యాన్వేషి. సంపాకీయాలలో 'మేము' అని రాయడం ద్వారా సంపాదకుడికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఆపాదించే ప్రయత్నం ఉంది. సంపాదకీయంలో వెలిబుచ్చే అభిప్రాయాలు ఒక్క సంపాదకుడివే కావనీ సంపాదక మండలివనీ చెప్పాలన్న అభిలాష కూడా ఉంది. గాంధీ నిర్యాణం చెందినప్పుడు 'ఆంధ్రప్రభ'లో మహాత్ముడి చిత్రం కింద 'నాడు ఏసుక్రీస్తు శిలువకు బలి, నేడు మహాత్ముడు తుపాకీకి బలి' అనీ, 'ఇక లేడు, మరిరాడు' అనీ నార్ల రాసిన వాక్యలు తెలుగు పత్రికా రచనలో కొత్త ఒరవడికీ, ఉరవడికీ శ్రీకారం చుట్టాయి. ఈ రోజు తెలుగు పత్రికలలో, టీవీ న్యూస్‌ ఛానళ్లలో కనిపిస్తున్న మెరుపులన్నింటికీ మూలం అదే. గాంధీజి కాలం చేసినప్పుడు నార్ల రాసి సంపాదకీయం నాటి పాఠకుల కంట తడి పెట్టించి ఉండాలి.
గాంధీ అస్తమించినప్పుడు 'ఆంధ్రప్రభ' ప్రచురించిన సంపాదకీయాన్ని చదివి వేటూరి ప్రభాకర శాస్త్రి సంపాదకీయ రచయితకు నమస్కారం చేశారంటే ఆయన ఎంతగా చలించి పోయారో ఊహించుకోవచ్చు. నార్లకు బలహీనతలు లేవని కాదు. ఆయనలో ఆత్మాశ్రయ ధోరణి తరచుగా ఆధిపత్యం చేసిన మాట నిజమే కావచ్చు. తాను అభిమానించే వారిని ఆకాశానికెత్తుతూ, వ్యతిరేకించేవారిని పాతాళానికి తొక్కుతూ రచనలు సాగించారన్న ఆరోపణా లేకపోలేదు. 'ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని (డెమొక్రాటిక్‌ సోషలిజం) విశ్వసిస్తూనే కమ్యూనిస్టులపైన (1955) దాడి చేసిన వైనం సరేసరి. కానీ ఆయన శక్తిమంతమైన వ్యక్తిత్వం ముందు ఈ ప్రతికులాంశాలు నిలువజాలవు.
ఒక పత్రికా సంపాదకుడికి ఉండవలసిన మంచి లక్షణాలలో అత్యధిక భాగాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి నార్ల. నవ్యతనూ, నాణ్యతనూ మేళవించి తెలుగు పత్రికారంగానికి శోభ తెచ్చిన సంపాదకుడు ఆయన. జాతి, వర్ణ, మత, కుల, వర్గ విభేదాలకు అతీతుడైన మానవుడిలాగా మానవీయ వ్యవస్థ కోసం పరితపించిన విశ్వజనీన రచయిత. సాటిలేని మేటి సంపాదకుడు. రచయితలకు, ముఖ్యంగా పత్రికా రచయితలకు చిరస్మరణీయుడు, స్ఫూర్తి ప్రదాత, తెలుగు పత్రికా నౌకకు దిక్సూచి.-(కొండుభట్ల రామచంద్రమూర్తి సినియర్‌ పాత్రికేయులు, ప్రధాన సంపాదకుడు- హెచ్‌ఎం టీవీ)

    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి