13, మే 2011, శుక్రవారం

ఆచార్య తూమాటి దొణప్ప Prof. Tumati Donappa


ఆచార్య తూమాటి దోణప్ప (జూలై 1, 1926 - సెప్టెంబర్ 6, 1996) ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు మరియు తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి (పూర్వ). కళా సాహిత్య, సంస్కృతీ విద్యా రంగాలలో గొప్ప కృషీ వలుడు.
దోణప్ప అనంతపురం జిల్లా రాకట్ల లో జన్మించాడు. వీరి మొదటి పేరు దోణతిమ్మారాయ చౌదరి. తాతగారైన తూమాటి భీమప్ప గారి వద్ద చిన్ననాటనే సంస్కృతం అభ్యసించాడు. విద్యార్ధి దశలో అనేక బంగారు పతకాలను, ఆంధ్రా విశ్వవిద్యాలయము నుండి M.A, Ph.D, D.Litt పట్టాలు పొందాడు.
ప్రభుత్వము నుండి ఉత్తమ ఆంధ్ర భాషాచార్యులు గా ప్రశంసా పత్రము, గౌరవాన్ని పొందిన దోణప్ప "ఆంధ్రుల అసలు కథ", "బాలల శబ్ద రత్నాకరం", "తెలుగు మాండలిక శబ్దకోశం", "భాషా చారిత్రక వ్యాసావళి", "ఆంధ్ర సంస్థానములు", "తెలుగులో కొత్త వెలుగులు", "జానపద కళా సంపద", తెలుగు హరికధా సర్వస్వం" మున్నగు పలు రఛనలు చేశాడు.

తూమాటి దొణప్ప

పుట్టుక :    1-7-1926 అనంతపురం జిల్లా రాకట్ల గ్రామం.
చదువు:     ఎం.ఏ; పిహెచ్.డి.
వృత్తి:         నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా, ప్రిన్సిపల్ గా, రిజిస్ట్రార్ గా, తెలుగు విశ్వవిద్యాలయం మొదటి ఉపాధ్యక్షులుగా, అధికార భాషాసంఘం అధ్యక్షులుగా, .
రచనలు :    తెలుగులో వైకృతపదస్వరూప నిరూపణం( సిద్ధాంత గ్రంధం), ఆంధ్ర సంస్థానాలు - సాహిత్య పోషణ, భాషా చారిత్రక వ్యాసావళి. తెలుగు హరికధా సర్వస్వం. తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళాసంపద, ఆకాశభరిత(రేడియో ప్రసంగ వ్యాస సంపుటి).
విద్యార్ధిగా:   ఆదర్శ శిఉఖరాలు(ఏకాంకిక), చంద్రుడు - కలువ (కధ), అన్వేషణ (గేయం),
స్వర్గస్థులు :   6-9-1996
ఉత్తమ అధ్యాపకులుగా, ఆదర్శ పరిశోధకులుగా, ప్రసిద్ధ భాషావేత్తగా, పరిపాలనా దక్షులుగా, జానపద సాహిత్య సంగ్రాహకుడుగా పేరొందిన ఆచార్య తూమాటి దొణప్ప గురించి వారి కుమారుడు కేంద్రప్రభుత్వ అధికారి, హైదరాబాద్ నివాసి తూమాటి సుధాకర్ సంగ్రహం ఇచ్చిన వివరణ.
(ద్వా.నా.శాస్త్రి నిర్వహణలో మొదట ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమై, తదుపరి ‘మానాన్నగారు’ పేరిట డా.ద్వా.నా.శాస్త్రి ప్రచురించిన గ్రంధం నుండి సేకరణ. వారికి ధన్యవాదాలు.)

మా నాన్నగారు మహామంచి నాన్నగారు. నా బాల్యం విశాఖపట్నంలోనే గడిచింది. ముందు ఆంగ్లమాధ్యమం చదివి ఆ తర్వాత తెలుగు మీడియంలో చదివాను. తెలుగు మీడియం అయితే బాగా అర్ధం అవుతుందనీ, చదువు బాగా వస్తుందని అనేవారు. మా నాన్నగారు ఎప్పుడూ కూడా “ఇది చదువు, అది చదవొద్దు’ అనే ఆంక్షలు విధించలేదు. నా ఇష్ట ప్రకారమే కామర్స్ చదివించారు. అమ్మగారు ఇంజనీరింగ్, ఎం.బి.ఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనేవారు. నాన్నగారు ఎప్పుడూ చెప్పలేదు. నా ఇష్టానికే వదిలేశారు.
మా నాన్నగారు సంజీవప్ప, తిమ్మక్క దంపతుల ఎనిమిదో సంతానం. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ‘రాకట్ల’ గ్రామంలో 1-7-1926న జన్మించారు. ఈ తేది పాఠశాలవారి ‘రికార్డు’ ప్రకారమే! మానాన్నగారి అసలు పేరు దొణతిమ్మరాయచౌదరి అట! తిమ్మరాయస్వామి వేంకటేశ్వరునికి స్థానిక నామధేయమంటారు. ఆపేరే నాన్నగారికి పెట్టారు. మా నాన్నగారి బాల్యం అంతా సంప్రదాయపరంగానే గడిచింది. ఇంగ్లీషు చదువంటే అనాచారం కింద లెక్క. భాగవతం, శతకాలు నిత్యపారాయణంగా ఉండేవట! సంస్కృత పంచకావ్యాలూ, ఆంధ్ర పంచకావ్యాలూ తూమాటి భీమప్ప గారి దగ్గర చదువుకున్నారు. గురుబాలప్రభోదిక కంటోపాఠం. అప్పటికి మా నాన్నగారి వయసు పన్నెండు సంవత్సరాలే.
మా నాన్నగారి జీవితం గురించి డా. నాగళ్ళ గురుప్రసాదరావుగారు ప్రత్యేక సంచికలో “మూడు అరవైల దొణప్ప” అనే వ్యాసంలో వివరించారు. ఇటీవల ద్వా. నా. శాస్త్రిగారు మానాన్నగారి జీవితం సాహిత్యంపై చిన్న పుస్తకం రాశారు. వీటి ఆధారంగానే చాలా గుర్తుకు తెచ్చుకున్నాను.
మానాన్నగారి మేనత్త భర్త చిన్న తిమ్మప్పగారు వజ్రకరూరులో పెద్ద ఆసామి. ఆయన మా నాన్నగారిని వజ్రకరూరు తీసుకువెళ్ళి స్కూల్లో చేర్పించారు. అప్పుడు ఆంగ్లభాష నేర్చుకున్నారు. ఇదే వారి జీవితంలో ఒక మలుపు. మా నాన్నగారు చిన్నప్పుడు ఎడ్లబండిమీదే రాకపోకలు సాగించేవారు. గుంతకల్లు వెళ్ళి రైలు ఎట్లా వుంటుందో చూసి ఆశ్చర్యపోయారట.
వజ్రకరూరులో ఉన్నప్పుడే మా నాన్నగారు నాటకాలు వేయడం మొదలుపెట్టారు. పద్నాలుగేళ్ళ వయస్సులోనే ముఖానికి రంగువేసుకున్నారు. ప్రధానోపాధ్యాయుల ఆజ్జమేరకు “చింతామణి” నాటకంలో మొట్టమొదటిగా ‘చిత్ర’ పాత్ర ధరించి ప్రశంశలు పొందారు. ఆ తర్వాత కృష్ణ, రుక్మాంగద పాత్రలు కూడా ధరించారట! ఉరవకొండ పాఠశాలలో చదువుతున్నప్పుడు నూతలపాటి పేర్రాజుగారనే తెలుగు పండితునివల్ల నాన్నగారికి ఆశు కవిత్వం అలవడింది. ఎనిమిదోతరగతి చదువుతున్నప్పుడే “చిత్రగుప్త” పత్రికలో మొట్టమొదటి రచన “చంద్రుడు - కలువ” అనే కధ అచ్చయింది. ఈ కధ వర్ణాంతర వివాహాన్ని అర్ధంతరంగా వ్యక్తీకరిస్తుందని నాగళ్ళవారు పేర్కొన్నారు. ‘సూర్యప్రభ’ అనే పత్రికలో రాధాగోపాలుల తత్వంపై ‘అన్వేషణ’ అనే గేయం రాశారు. అప్పటికి నాన్నగారు హైస్కూలు విద్యార్ధి మాత్రమే!
అనంతపురంలో మా నాన్నగారి కళాశాల విద్య కొనసాగింది. అక్కడ శంఖవరం రాఘవాచార్యులుగారూ(సంపత్), కారెంపూడి రాజమన్నారుగారు తెలుగులో గురువులు. చిలుకూరి నారాయణరావుగారు ప్రత్యేకోపన్యాసాలిచ్చేవారు. అప్పుడే నాన్నగారికి భాషాశాస్త్రంపై అభిమానంమొలకెత్తింది. కళాశాల విద్యార్ధిగా “బైబిలు, కురాను, భగవద్గీత” పరీక్షలో ప్రధమ స్థానం లభించి, మీనాక్షిసుందరాంబా స్మారక బహుమానం పొందారట! మద్రాసు విశ్వవిద్యాలయంనుంచి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆచార్య గంటిజోగి సోమయాజులు గారు వాల్తేరు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ప్రధానాచార్యులుగా ఉండగా మానాన్నగారు ఆనర్సు చదివారు. జానపద సాహిత్యమన్నా, మాండలికాలన్నా మానాన్నగారికి మరీ ఇష్టం. వీటికి సంబంధించి చాలా సమాచారం సేకరించారు. ఊరూరూ ఎంతో కష్టపడ్డారు.
మానాన్నగారు ఆనర్సులో “ద్రవిడియన్ ఫిలాసఫీ అండ్ జనరల్ లింగిస్టిక్స్” ను ప్రత్యేక అంశంగా అభ్యసించారు. సాహిత్యం బాగా చదివినవారికి భాషాశాస్త్రం  సరిపడేది కాదని విన్నాను. కానీ మానాన్నగారు రెండిటిలోనూ నిపుణులే. భాషాశాస్త్రం చెప్తే మా నాన్నగారె చెప్పాలని వారి శిష్యులు చెప్తూవుంటారు. మా నాన్నగారు ఆంధ్రవిశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పనిచేస్తున్నప్పుడు  భాషాశాస్త్రం  భోధించేవారు. తమ క్లాసుకి ముందు రెండు మూడు నిముషాలు క్లాసు గుమ్మంముందు నుంచుని ఉండేవారట.అంతకు ముందు మేష్టారు వెళ్ళగానే వెంటనే క్లాసులోకి వెళ్ళేవారట! యూనివర్సిటిలో కూడా ఇంతగా ఉంటారా! అని విద్యార్ధులు ఆశ్చర్యపోయేవారని ద్వా,నా.శాస్త్రిగారు చెప్పారు.
అనకాపల్లి కళాశాల వారూ, గుడివాడ కళాశాల వారూఉద్యోగాలు ఇస్తామన్నా మా నాన్నగారు వెళ్ళలేదు. ఆచార్య గంటిజోగి సోమయాజిగారి వద్ద పరిశోధక విద్యార్ధిగా చేరారు. పూనా దక్కను కళాశాలలో భాషాశాస్త్రం ప్రత్యేక శిక్షణ తరగతులకు హాజరయ్యారు. సునీత్ కుమార్ చటర్జీ, సుకుమారసేన్ వంటివారి ఉపన్యాసాలు విని ఉత్తేజంపొందారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం చేపట్టిన “తెలుగు వ్యుత్పత్తి పదకోశం” ప్రారంభంలో మా నాన్నగారు ముఖ్యసహాయకులుగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చినవారు మా నాన్నగారి పేరును స్మరించలేదు! ఇలా వుంటుంది లోకం!
1958నుంచి 1961 వరకు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడిగా - ముఖ్య సహాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగు శాఖలో రీడర్ అయ్యారు. ఆచార్యులు అయ్యారు. ౧౯౭౦లో తెలుగు శాఖ ఆచార్యులుగా, ప్రిన్సిపల్గా, రిజిస్ట్రార్ గా పనిచేశారు. తెలుగు విజ్ఝానపీఠం అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. చివరగా అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి. ఎన్.టి.రామారావుగారు ముఖ్యమంత్రిగా పదవీచ్యుతులు కాగా నైతిక విలువలను పాటిస్తూ తమ పదవికి రాజీనామా చేశారు.
నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎం.కాం చదువుతున్నప్పుడు మా నాన్నగారు ప్రిన్సిపల్ గా, రిజిస్ట్రార్ గా పనిచేశారు. ఒకరిద్దరికి తప్ప నేను దొణప్పగారి అబ్బాయినని ఎవరికీ తెలీదు. ఫలానావారి అబ్బాయిగా నేనెందుకు ‘ఫోకస్’ అవ్వాలి అని నాకు ఉండేది. మా నాన్నగారి అభిప్రాయమూ అదే.
మా నాన్నగారు పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. పైగా బంధువులకు చాలా సహాయపడేవారు. మా పెదనాన్నగారి అబ్బాయిని మా ఇంట్లోనే వుంచి చదివించారు. మేనమామగారిని చదివించారు. బీద విద్యార్ధులకు సాయం చేసేవారు. చెల్లెళ్ళ పెళ్ళిఖర్చులకోసం ఇల్లు అమ్మేశారు. తన పుస్తకాల అమ్మకాలద్వారా పాతిక వేలు వచ్చింది. మానాన్నగారి చిన్ననాటి మిత్రుడు బలరామరాజుగారు వడ్డీలేకుండా అప్పు ఇచ్చారు.1978 ప్రాంతంలో వారికి వచ్చిన పెన్షన్ డబ్బు, ఎల్.ఐ.సి లోన్, నాది కొంత తీసుకొని హైదరాబాద్ లో ఫ్లాట్ కొన్నారు. నేను ఫారిన్ ట్రేడ్ లో డిప్లొమా చదవడానికి ఢిల్లీ వెళ్తానంటే నెలకి వెయ్యిరూపాయలకంటే ఎక్కువ ఇవ్వలేనన్నారు. అలాగే సర్దుకు పోయాను. ఆయన డబ్బు బాగా సంపాదిస్తే మేమింత కష్టపడేవాళ్ళం కాదు.
మా నాన్నగారు చాలా నిక్కచ్చి మనిషి. యూనివర్సిటి గొడవలుగాని, డిపార్టుమెంటు గొడవలుగాని ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించేవారుకాదు. చాలా గుంభనంగా ఉండేవారు. లోలోపల బాధపడేవారనుకుంటాను. చాలా నిరాడంబరంగా ఉండేవారు. చాలామంది శిష్యుల్ని సంపాదించారుగానీ, మిత్రుల్ని ఎక్కువగా పొందలేక పోయారనిపిస్తుంది.
సాహిత్య రచనలు ఎక్కువగా యూనివర్సిటి క్యాంపస్ లోనే చేసేవారు. మేం పడుకునే సమయానికి ఇంటికి వచ్చేవారు. తెల్లవారుజామున 5 గంటలకు లేచి చదువుకొనేవారు, రాసుకొనేవారు. మా నాన్నగారి సాహిత్య ప్రభావం మా మీదలేదు. ఆయన రాసినవాటిలో కొన్నిటిని చదవడం తప్ప నీట్ గా డ్రస్ చేసుకోవటం, ఇన్ షర్టు, బూటు, టై తోనే నేర్చుకున్నాను. “నీకోసం నేనేమీ ఆర్ధికంగా చెయ్యలేకపోయాను” అనేవారు. “మీరు తండ్రిగా చెప్పుకోవడమే నాకు గర్వకారణం” అనేవాడ్ని. నాన్నగారి శిష్యులెందరో ఆచార్య పదవుల్లో వున్నారు. సాహిత్యరంగంలో పేరు పొందిన వారున్నారు. అయితే కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ మా నాన్నగారిని స్మరించుకుంటూ వుంటారు.
విజయవాడలో మా నాన్నగారు హటాత్తుగా 6-9-1996 న మరణించారు. వారు చనిపోయిన తర్వాత వారి విలువ మరింత తెలిసింది. తండ్రిగా కంటే స్నేహితుడిగానే ప్రవర్తించిన మా నాన్నగారిని “గురుశిరోమణి” అని శిష్యులు కీర్తిస్తూ వుంటే అంతకంటే ఆనందం ఏముంది? వారి భాషాసాహిత్యాల సేవ గురించి వివరించే శక్తి నాకు లేదని మనవి చేసుకుంటున్నాను. కానీ ఎన్నో సంవత్సరాలు శ్రమించి మనుషులపేర్లు, ఊళ్ళ పేర్లు, ఇంటిపేర్లు ఎలా వచ్చాయో సేకరించి, వింగడించి, విశ్లేషించి రూపొందించిన గ్రంధం లిఖిత ప్రతి దొరకలేదు. దీనిని “మీ పేరేమిటి?”అనే పుస్తకంగా ప్రచురించాలనుకున్నారు. అది నెరవేరలేదు.

రచన  - తూమాటి సుధాకర్
డా. ద్వా.నా.శాస్త్రి గారి అవిరళ కృషితో వెలువరించిన “మా నాన్నగారు” గ్రంధం నుండి సేకరణ.
వారికి ధన్యవాదాలు


ఆచార్య తూమాటి దొణప్పగారి రచన ‘ఆకాశభారతి’ కోసం ఈక్రింద ‘క్లిక్’ చేయండి..


akasabharati

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి