13, మే 2011, శుక్రవారం

తెలుగు లెంక - తుమ్మల సీతారామ మూర్తి Tummala Sitaramamurty


(వికీపీడియా నుండి)
తెలుగులెంకగా సుప్రసిధ్ధుడైన తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. తెలుగుదనం మూర్తీభవించిన జాతీయోద్యమ కవి. "మహాత్ముని ఆస్థానకవి" అని కట్టమంచి రామలింగారెడ్డితో పలికించుకున్న తుమ్మల, ఆత్మకథ,మహాత్మకథ వంటి ఆదర్శ ప్రౌఢకావ్యాలు, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ఉదయగానము, పఱిగపంట, పైర పంట, శబల, సమదర్శి, నా కథలు వంటి సామాజిక కవిత్వాన్ని అందించారు. అచ్చ తెలుగు మాటలతో అందమైన పద్యాలు అల్లగలిగిన ఆధునిక కవుల్లో తుమ్మలను మించిన వారు లేరంటె అతిశయోక్తి కాదు. ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడైన తుమ్మల గాంధీ భక్తి, తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి.

జీవన సంగ్రహము

తుమ్మల సీతారామమూర్తి 1901 డిసెంబర్ 25గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని కావూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చెంచమాంబ, నారయ్య. 1930 లో అన్నపూర్ణమ్మతో అయనకు పెళ్ళి జరిగింది. వారికి ఒక కుమార్తె నలుగురు కుమారులు కలిగారు.
ఆయనకు విద్యాబుద్ధులు చెప్పి తీర్చిదిద్దిన గురువులు కావూరి శ్రీరాములు, జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి. 1930 లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి ప్రథమశ్రేణిలో ఉభయభాషాప్రవీణ పట్టాను అందుకున్నాడు. చదువు పూర్తయ్యాక, తన స్వగ్రామం కావూరు లోని తిలక్ జాతీయ పాఠశాల లో 1924 నుండి 1929 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1930 నుండి 1957 వరకు గుంటూరు జిల్లా బోర్డునందలి దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు, అప్పికట్ల ఉన్నతపాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. 1920 - 1930 మధ్య కాలంలో కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1922లో జైలుశిక్ష అనుభవించాడు.
గ్రామజీవనము, గాంధీతత్త్వము, సర్వోదయము, ఆంధ్రాభ్యుదయము, తిక్కన కవితామార్గము, చిన్నయసూరి సిద్ధాంతము ఆయనకు అభిమాన విషయాలు.
1990 మార్చి 21గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని అప్పికట్ల గ్రామలో తుమ్మల సీతారామమూర్తి మరణించాడు.

సాహితీ కృషి

సీతారామమూర్తి పలు రచనా రూపాలను స్పృశించాడు. ఆయన రచనలను స్థూలంగా కింది విధాలుగా విభజించవచ్చు.
  • గాంధీకావ్యాలు - ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీగానము, మహాత్మగాంధీ తారావళి.
  • రాష్ట్రకావ్యాలు - రాష్ట్రగానము, ఉదయగానము.
  • ఖండకావ్యాలు - పఱిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, చక్కట్లు, దివ్యజ్యోతి.
  • కథాకావ్యాలు - ఆత్మార్పణము, ధర్మజ్యోతి.
  • సామాజిక కావ్యాలు - ఎక్కట్లు, సందేశసప్తశతి.
  • స్వీయచరిత్ర కావ్యాలు - నేను, నా కథలు, తపస్సిద్ధి.
  • వేదాంతకావ్యాలు - గీతాదర్శము, భజగోవిందం, లక్ష్మీనృసింహ స్తోత్రము, హనుమాన్ చాలీసా.
  • నీతికావ్యాలు - తెనుగు నీతి, నీతికుసుమావళి.
  • స్మృతికావ్యాలు - రామకృష్ణస్మృతి.
  • శతకములు - పురాంతక శతకము, రామశతకము, రామలింగేశ్వర శతకము.
  • జంగం కథలు - బిల్హణీయము.
  • నాటకాలు - గిరికా పరిణయము, హనుమద్విజయము,మహేంద్ర జననము.
  • హరికథలు - అన్నదాన మాహాత్మ్యము, సాత్రాజితీ పరిణయము, నామదేవ చరిత్రము.

కృతులు (ప్రచురించిన సంవత్సరము క్రమములో)

  1. గిరికా పరిణయము, 1911-1918
  2. మధ్య హనుమద్విజయము, 1911-1918 మధ్య
  3. అన్నదాన మాహాత్మ్యము, 1911-1918 మధ్య
  4. సాత్రాజితీ పరిణయము, 1911-1918 మధ్య
  5. పురాంతక శతకము, 1911-1918 మధ్య
  6. రామశతకము, 1919
  7. రామలింగేశ్వర శతకము, 1919
  8. బిల్హణీయము, 1920
  9. మహాత్మగాంధీ తారావళి, 1921
  10. నామదేవ చరిత్రము, 1922
  11. రామకృష్ణస్మృతి, 1923
  12. భజగోవిందం, 1923
  13. లక్ష్మీనృసింహ స్తోత్రము, 1925
  14. మహేంద్ర జననము, 1924
  15. ఆత్మార్పణము (4 ముద్రణలు), 1932-1953
  16. ఆత్మకథ (ప్రథమ భాగము), 1936
  17. నీతికుసుమావళి, 1937
  18. రాష్ట్రగానము (7 ముద్రణలు), 1938-1973
  19. ధర్మజ్యోతి (5 ముద్రణలు), 1943-1985
  20. పఱిగపంట (2 ముద్రణలు), 1943-1952
  21. పెద్దకాపు, 1948
  22. అమరజ్యోతి, 1948
  23. తపస్సిద్ధి, 1949
  24. ఆత్మకథ (మొత్తం అయిదు భాగములు), 1951
  25. ఉదయగానము (2 ముద్రణలు), 1955-1973
  26. శబల, 1955
  27. సర్వోదయగానము, 1961
  28. తెనుగు నీతి, 1961
  29. నేను, 1963
  30. గీతాదర్శము, 1963
  31. పైరపంట, 1964
  32. సమదర్శి, 1967
  33. మహాత్మకథ, 1968
  34. నా కథలు, 1973
  35. ఎక్కట్లు, 1976
  36. హనుమాన్ చాలీసా, 1978
  37. సందేశసప్తశతి, 1981
  38. కదంబకైత, 1983
  39. గాంధీగానము, 1987
  40. చక్కట్లు, 1993
  41. దివ్యజ్యోతి, 1994
  42. తెనుఁగులెంక తుమ్మల సమగ్ర సాహిత్యము, తుమ్మల శతజయంతి ఉత్సవ సంఘ ప్రచురణ, గుంటూరు, 2001
    1. మొదటి భాగము - బాపూజీ ఆత్మకథ
    2. రెండవ భాగము - మహాత్మకథ
    3. మూడవ భాగము - ఖండకావ్యములు - రామశతకము, రామలింగేశ్వర శతకము, మహాత్మగాంధీ తారావళి, మహేంద్ర జననము, రామకృష్ణస్మృతి, ఆత్మార్పణము, రాష్ట్రగానము, ధర్మజ్యోతి, పఱిగపంట, శబల, ఉదయగానము, సర్వోదయగానము, తెనుగు నీతి, నేను, గీతాదర్శము
    4. నాల్గవ భాగము - ఖండకావ్యములు - పైరపంట, సమదర్శి, నా కథలు, హనుమాన్ చాలీసా, సందేశసప్తశతి, కదంబకైత, గాంధీగానము, చక్కట్లు, దివ్యజ్యోతి

తుమ్మల కవితా సంకలన గ్రంథములు

  1. యుగకవిత, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1984
  2. రంగా - భారతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1986
  3. సంక్రాంతి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1988
  4. రైతుజీవనము, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
  5. సత్యం శివం సుందరం, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1990
  6. తుమ్మల వాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1992
  7. తుమ్మల యుగవాణి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 1996
  8. తుమ్మల సుభాషితములు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2000
  9. తుమ్మల వాణి, తుమ్మల శతజయంతి ఉత్సవ కమిటి, 2001
  10. ఆంధ్రప్రశస్తి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2004
  11. పండుగ కవితలు, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005
  12. తెనుఁగుతీపి, తుమ్మల శ్రీనివాసమూర్తి , 2005

సమ్మానములు

బిరుదులు

  • ఇతరుల దృష్టిలో "అభినవతిక్కన"
  • తన దృష్టిలో "తెనుఁగులెంక".

తుమ్మల జీవితము, కవిత్వము, వ్యక్తిత్వము పై ఇతరులు వ్రాసిన గ్రంథములు

  1. తెనుఁగులెంక తుమ్మల, గొల్లపూడి ప్రకాశరావు, 1975
  2. యుగకవి తెనుఁగులెంక శ్రీ తుమ్మల సీతారామమూర్తి, తుమ్మల శ్రీనివాస మూర్తి, 1989
  3. తెనుఁగులెంక తుమ్మల సీతారామమూర్తి కవిత్వం - వ్యక్తిత్వం, జూపూడి అమ్ములయ్య (అమూల్యశ్రీ), 1995
  4. తుమ్మల సీతారామమూర్తి (భారతీయ సాహిత్య నిర్మాతలు), నాగళ్ల గురుప్రసాదరావు, సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ, 2000
  5. అజరామరవాఙ్మయమూర్తి తుమ్మల సీతారామమూర్తి, సూర్యదేవర రవికుమార్, 2002
తెలుగు లెంక - తుమ్మల సీతారామ మూర్తి
తెలుగు భాషా సాహిత్యాలకు ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ, ఘన సన్మానం చేసి 'అభినవ తిక్కన' అనే బిరుదును ఇస్తే, వినయపూర్వకంగా, తాను తిక్కన అంత ఘనుణ్ణికాదని, 'తెలుగు భాషకు సేవకుడను' అనే అర్థం వచ్చేలా 'తెనుగు లెంక' అని పేరు పెట్టుకున్న మహాకవి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. ఇరవై నాలుగు వేల పద్యాలు వ్రాసినా, విద్యార్థులకు ఆయన రచనలను పాఠ్యాంశాలుగా నిర్ణయించకపోవడంతో ఆయన సాహిత్యం నిరాదరణకు గురవుతున్నది.

ఏ అభ్యుదయ కవికీ, విప్ల వ కవికీ తీసిపోని భావాలను తెనుగులెంక ఎన్నడో తన కవితల్లో వ్యక్తీకరిం చి వున్నారు. గుంటూరు జిల్లా కావూరులో 1901 డిసెంబర్ 25న సీతారామమూర్తి జన్మించారు. చెంచమ్మ, నారయ్యలు తలిదండ్రులు. నిజాయితీగల రైతు కుటుంబంగా వాసికెక్కిన ఇంట జన్మించిన ఈ కవి జీవితంలో నూ, కవితలోనూ నిజాయితీకే ప్రాముఖ్యం ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు.

తుమ్మల వారు గాంధీ కవి. ఆత్మకథ, మహాత్మకథ, అమరజ్యోతి, సర్వోదయగానము, గాంధీ గానము, మహాత్మాగాంధీ తారావళి తుమ్మల రచించిన గాంధీ కావ్యాలు. గాంధీ తత్త్వం, సర్వోదయం ఆయన జీవితంతో ముడివేసుకున్న అంశాలు. తుమ్మల వారు 'మహాత్ముని ఆస్థాన కవి' అని కట్టమంచి రామలింగారెడ్డి ప్రశంసించారు. కవిత్వాన్నే గాక తన జీవితాన్ని గూడా గాంధీ మార్గంలో నడిపిన కవి తుమ్మల. తెలుగుదనం అంటే ఆయ న ఒడలు పులకరించిపోతుంది.

స్వాభిమానం మెండు. రాష్ట్రగానం, ఉదయగానం ఆనాడు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన కావ్యాలు. రైతు కుటుంబంలో పుట్టి, ఒక పూట పొలానికి, ఒక పూట బడికి పోయిన తుమ్మల కవిత్వంలో 'రైతు' తొంగి చూస్తుంటాడు. పరిగపంట, పెద్దకాపు, శబల, పైరపంట, సమదర్శి, కదంబకైత, దివ్యజ్యోతి తుమ్మలవారి ఖండ కావ్యాలు. ఆత్మార్పణము, ధర్మజ్యోతి వీరి కథా కావ్యాలు. ఇంకా పెక్కు సామాజిక కావ్యాలు, శతకాలు, నాటకాలు, హరికథలు, చరిత్రములను తుమ్మల రచించారు.

రైతు జీవితానికి కావ్య గౌరవం కల్పించి, తెలుగు నుడికారానికి ప్రాణంపోసి, తెనుగుదనానికి నిర్వచనంగా నిలిచిన తుమ్మలను కొంగర జగ్గయ్య 'కళా తపస్వి'గా సంభావించాడు. 'వాస్తవిక జగత్తుకు కాల్పనిక ప్రతిబింబమే కావ్యజగత్తు అన్న నిజాన్ని సీతారామమూర్తిగారు తమ రచనల ద్వారా నిరూపించార'ని తెనుగులెంక శతజయంతి సందర్భంగా తమ నమోవాకాలు సమర్పించాడు.

తెలుగు జాతినీ, దేశాన్ని తలుచుకుంటే చాలు తుమ్మలవారి కన్నులు ఆణిముత్యాలవుతాయి. గమగమలాడే పైర వంకాయకూర, ముదురు గుమ్మడి పండు ముదురు పులుసూ, జిడ్డుదేరిన గడ్డ పెరుగూ వుంటే.. ఇంకేం కావాలి? తెలుగునాటి భోగభాగ్యాలకూ, సరస సల్లాపాలనూ, కన్నులకు కట్టేట్లు, నోరూరేలా తెనుగులెంక వర్ణించాడు. నేటి ఆంధ్రులు అనుభవిస్తున్న దైన్యాన్ని తలుచుకొని, తల్లి నాదుకోలేని తెలుగు బిడ్డ బ్రతుకు బరువు చేటు అని వాపోయాడు.

తుమ్మల కుప్పలు నూర్చాడు. గడ్డి పీకాడు. వెంటి కట్టాడు. పది మోపుల గడ్డి పనలను ఒక్కడే నెత్తిన పెట్టుకున్నాడు. వ్యవసాయం చేసినన్నాళ్లు శరీరం సౌష్ఠవంగా వుంది. బండి చక్రం ఊబిలో దిగబడితే గిత్తలు లాగలేకపోయాయి. తుమ్మల బండి కాడిని తన మెడమీద వేసుకొని బండి ని బయటకు లాగగలిగాడు. చదువుకున్నా డు కాబట్టి ఉపాధ్యా య వృత్తి లోకిపోయా డు. 'పంచదార అనుకొని చేదు మెక్కానే' అని తుమ్మల బాధపడుతూ' 'ఒక మర కైవ డిం గదలుచున్న యెడల్ కురిబీకి దత్తమైనది' అన్నాడు.

విశ్వనాథ సత్యనారాయణ ఇలా అంటాడు-'ఓయి నాగరకులారా! కృషీవల జీవన విముఖులారా! ఈ మహాకవిని వినుడు! నాగరికతా భ్రాంతిని వదిలించుకొనుడు!' ఇదే తుమ్మలవారి సందేశం అని కూడా మనం భావించవచ్చు. ఆయన్ని చూస్తే అచ్చం తెలుగు రైతులాగా వుండేవాడు కాని 'కవి వేషం' కనబడేది కాదు. ఆరడుగుల నల్లని విగ్రహం. పల్లెటూరి పెద్దరికం తొణికసలాడే నుదురు.

పొడుగైన ముక్కు. గుబురైన మీసాలు. ఖద్దరు దుస్తులు. ఆచితూచి మాటలు. సద్గుణాల ప్రోగు. ఆయన ఒక విషయంలో మాత్రం గర్వి ష్ఠి! తాను తెలుగు వాడైనందుకు ఆయన గర్విస్తాడు. తెలుగుజోదుల తుటారి కటారి చెలరేగి పగర చీల్చిన దినాన్ని జ్ఞప్తి చేసుకొని, పారతంత్య్రానికి, కులతత్వాలకు, ఈర్ష్యకులోనై, కుక్కలు చింపిన విస్తరిగా దేశాన్ని చేసిన ఆంధ్రజాతిని ఈసడించుకున్నాడు. రాష్ట్ర సిద్ధి కోసం 'రాష్ట్ర గానం' రచించి, రాష్ట్ర వృద్ధికోసం 'ఉదయగానం' ఆవిష్కరించాడు తుమ్మల.

పదవుల కోసం కుమ్ములాటను గాంచి కవి మనసు కలత చెందింది. ఇలా అంటాడు.'దొడ్డ తలపులున్న రెడ్డికైనను మాల/బిడ్డకైన నిమ్ము పెత్తనమ్ము కులము లింక నిల్వగలవటోయీ! వేరు/ పరువు పడియె, వాని పరువు సెడియె' 'బిచ్చగాడు లేని, మ్రుచ్చులేని, కటారిలేని, దొర తనమ్ములేని కుట్రలేని' దేశపరిస్థితుల కోసం కవి ఎదురుచూశాడు. నిజంగా అటువంటి రోజువస్తే అదే 'క్రొత్త సంక్రాంతి' కవికి. నేటి రచయితలకు 'పునాది తక్కువ' అని వారి నిశ్చితాభిప్రాయం.

ఒక ఇంటర్వ్యూలో తుమ్మల ఇలా అన్నారు.'నా రచన పద్యము. దీనికి వ్యవహారిక భాష సాయపడదు. గణము కోసమో యతి ప్రాసల కోసమో సలక్షణ భాషనాశ్రయింపక తప్పదు. వచనము గేయము ఆధారముగా చేసుకొని యువ కవులు వ్యవహారిక భాషలో కవిత్వము వ్రాయుచున్నారు. వీరిలో శ్రీశ్రీ వంటి సిద్ధహస్తులు కొందరున్నారు. భాషా మార్గము ఏదైనను రచయిత లోతుగా సాహిత్య కృషి చేసినపుడే పది కాలాల పాటు అది చరిత్రలో నిలుచును. మా తరం వారు చదివినంత గట్టిగా నేటి యువతరం కావ్య పఠనం చేయడం లేదు. పత్రికల నిండా ఏదో రాస్తున్నారు.

చాలా మంది పలుకులలో ప్రాణం లేదు. పునాది తక్కువ. తనదంతా విప్లవ కవిత్వం అని ఆయన భావన. తమతరం కవుల్లో శృంగారం జోలికి వెళ్లని వారిలో తుమ్మల మొదట నిలుస్తాడు. ఆయన రచన చేయడం ప్రారంభించాక భావ కవిత్వం వచ్చింది. తుమ్మల మనసు దాని మీదకు పోలేదు. తరువాత అభ్యుదయ, విప్లవ కవిత్వాలు వచ్చాయి. వాటి పద్ధతి తుమ్మల చూశాడు. అప్పటికి తుమ్మల రాసిందంతా విప్లవ కవిత్వమే! కాకపోతే ఒక తేడా ఉంది. తుమ్మల విప్లవం అంతా అహింసాయుతం. తుమ్మల సీతారామమూర్తి స్వగృహంలోనే 1990 మార్చి 21న పరమపదించారు
-శ్రీరామ్
.........................................
‘తెనుగు లెంక’

గుంటూరు జిల్లా కావూరు గ్రామంలో 1901 డిసెంబర్‌ 25న జన్మించిన తుమ్మల చిన్న వయసులోనే కవిత్వ రచన ప్రారంభించారు. 1920లో జాతీయోద్యమానికి ఆకర్షితుడై కాంగ్రెస్‌ కార్యకర్తగా రూపొందారు. 1924లో కావూరులో ప్రారంభించిన తిలక్‌ జాతీయ విద్యాలయంలో ఆంధ్రోపాధ్యాయుడుగా చేరారు. 1930 నుంచి గుంటూరు జిల్లా బోర్డు హైస్కూళ్ళలో తెలుగు పండితుడుగా పని చేశారు. అప్పికట్ల గ్రామంలో నివాసముంటూ బాపట్ల బోర్డు హైస్కూలులో కూడా పనిచేశారు.కవిత్వంలో యుగధర్మం ప్రతిబింబించాలని చాటి తుమ్మల యుగ కవి అయ్యారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని గాంధీ కవి అయ్యారు. రాష్ట్ర గానం చేసి రాష్ట్ర కవి అయ్యారు. జాతీయోద్యమంలో పాల్గొని జాతీయ కవి అయ్యారు. సిఆర్‌ రెడ్డి ఆయనకు ‘అభినవ తిక్కన’ అనే బిరుదాన్ని ఇచ్చారు. కాని తుమ్మల తెలుగు భాషకు సేవ చేసేవాడిననే అర్ధంలో తనను తాను ‘తెనుగు లెంక’గా పిలుచుకున్నారు. తుమ్మల ‘మహాత్మ కథ’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ శాశ్వత సభ్యుడుగా నియమితులయ్యారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ డిగ్రీని తుమ్మలకు అందజేసింది. 1990 మార్చి 12న తుమ్మల అస్తమించారు.


ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో జాతీయ భావ స్ఫూర్తి, సామాజిక స్పృహలను ఊపిరిగా చేసుకుని సమాజాభ్యుదయ కవితలను నిండుగా, దండిగా సృష్టించిన 20వ శతాబ్దాన్ని నిజమైన సర్వర్ణయుగంగా పరిగణించవచ్చు. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల భారతీయ భాషల్లో అనేక మార్పులు వచ్చాయి. ఈ శతాబ్దిలో ఎందరో కవులు పుట్టారు. ఎంతో ప్రక్రియా వైవిధ్యంతో కవితాగానం చేశారు. ఎన్నో సాహిత్య ఉద్యమాలు వచ్చాయి. పద్య, గేయ, వచన కవితల్లో ఎందరో గ్రంథాలు వెలువరించారు. వీరందరూ ఒక సిద్ధాంతానికో, లేదా ఒక వర్గానికో కట్టుబడి కవితా గానం చేశారు.

కాని, యుగ లక్షణాలన్నింటినీ తమ కవితలో కళాన్వితంగా గుబాళించి, అందరి అభ్యుదయానికి నవీన గాంధీ పథాన సర్వోదయ కవితను సృష్టించినది ఒకే ఒక్క మహాకవి ‘తెనుగు లెంక’ తుమ్మల సీతారామ మూర్తి. ఆధునికాంధ్ర సాహిత్యంలో పాత కొత్తలు సంఘర్షించి, నవ్య ధోరణులు ప్రారంభమైన కాలంలో తుమ్మల వారు సంప్రదాయ కవితాభినివేశంతో సాహితీ క్షేత్రంలో అడుగు పెట్టారు. 80 సంవత్సరాలకు పైగా సాగిన వారి కవితా ప్రస్థానంలో ఆనాటి సాహిత్యోద్యమాలన్నింటిలోని మంచిని స్వీకరించి, వాటన్నింటికి అతీతమైన మానవతా దృక్పథాన్ని ఒక బలమైన వ్యక్తిత్వ ముద్రతో తమ కవితలో వ్యక్తం చేశారు.

వారు వాస్తవిక కళా చరిత్రలో యుగ ధర్మాన్ని గుర్తించి మహోన్నతమైన ఆశయంలో మానవుని మానవోత్తముడుగా చేసేందుకు సర్వ స్వతంత్ర అభ్యుదయ కవితా సృష్టి చేసి ఒక నూతన అధ్యాయాన్ని ఆరంభించారు. మానవతా వాదమే ఊపిరిగా విశ్వ జనీన సాహిత్యాన్ని సృష్టించిన యుగ కవి తుమ్మల.

‘గిఱి గీచుకొన్న కవి కృతి- చిర కాలము నిల్వ; దెల్ల సిద్ధాంతములన్‌- దరియించి విప్లవము దెస- కరిగిన కృతి సత్యదర్శియై రాణించున్‌’ అని ప్రకటించి తన కవితా ధోరణిని విస్పష్టంగా తెలియజేసి, తమ కవితోద్యమాన్ని వారే సృష్టించుకున్నారు. విప్లవం అనగా రక్తపాతంతో కూడినది కాదు, విప్లవం అంటే మార్పు. సమాజ వ్యవస్థలో మంచి మార్పు కోసం చేసే శాంతియుత ఉద్యమమే విప్లవం. ఈ మార్గం ద్వారా వచ్చిన మార్పు శాశ్వతంగా ఉంటుంది. అందువలనే సత్యం, అహింస, ధర్మం, సమత, నైతిక అంశాల ప్రాతిపదికగా వారు సార్వకాలీనం, సార్వజనీనం, సౌందర్యవంతమైన సందేశాత్మక కవిత వ్రాశారు.

వారి కవిత వ్యవస్థలన్నింటికి సంగమ స్థలం. సమకాలీన జీవన విధానాన్ని ధర్మబద్ధంగా, వివేచనా పూర్వకంగా, హేతుబద్ధంగా, సామరస్యంగా, ఆదర్శప్రాయంగా రూపొందించి, సర్వోదయ కవితను సృష్టించి, నవ్య సంప్రదాయ సర్వోదయ విప్లవకవిగా ప్రసిద్ధి గాంచారు. వారు భావ విప్లవాన్ని కోరారే గాని, భాషా విప్లవాన్ని కోరలేదు. సంప్రదాయ పద్య రచనలోనే నియమబద్ధమైన భాషతో, సరళమైన చక్కని పలుకుబడితో, సమన్వయ దృష్టితో, స్పష్టతతో, సూటిదనంతో, ఘాటుదనంతో ఆధునిక భావ ప్రతిపాదన చేసి, నవయుగ హృదయ స్పందనను తన రచనలలో వినిపించారు. అంతేకాక అభ్యుదయ దృష్టి, చిత్తశుద్ధి ఉన్న కవికి ఛందస్సు మల్లెపూల మాల అని నిరూపించిన నవ విప్లవ కవి తుమ్మల. ఆధునిక రాజకీయ, ఆర్ధిక, మత, సాంఘిక, నైతిక సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను తమ కావ్యాలలో సూచించారు. వారి కవితలో జాతి జీవనం సర్వతోముఖంగా ప్రతిబింబిస్తుంది. అందువలననే వారి కావ్యాలు ఆంధ్రుల, భారతీయుల హృదయ స్పందనలకు వాస్తవమైన అక్షర రూపాలు.

‘తుమ్మల వారి వాణి ఎప్పటికప్పుడు కాలంలో పాటు, కాలం కంటే ముందు నడుస్తూ ఆశాకిరణాలను ప్రసరింప జేస్తూనే ఉంటుంది. సర్వాంగ సుందరమైన వారి కవిత్వం చదువుతూ ఉంటే ప్రాణాలు లేచి వస్తవి’ అని మహాకవి కాటూరి వేంకటేశ్వరరావు వ్రాసిన మాటలు అక్షర సత్యాలు. వారి కవితలో మానవతా పరిమళాలు వెదజల్లు విశ్వ సంస్కృతి కలదు. అందువలననే వారి కవిత ఈ యుగానికే గాదు, యుగ యుగాలకు పరిమళిస్తూనే ఉంటుంది.

తుమ్మలవారి కవితాశయం మహోన్నతమైనది, విస్తృతమైనది, విశ్వజనీనమైనది. ‘కళ కొరకే కవిత్వమని గంతులు వేయక, రోత రోతగా- వలపులు నింపి కబ్బములు వ్రాయక, విశ్వజనీన బోద్దృతా- లతిత, ముదారవృత్తము, కలాకమనీయము, సంస్కృతి ప్రభామిళితమునైన సృష్టి నెదమెచ్చితి జాతికి కాన్కలిచ్చితిన్‌’ అని ప్రకటించి ఉత్తమ ప్రబోధాత్మకమైన కావ్యాలను వ్రాశారు. ‘తుమ్మల వారిది ధర్మబోధ. ఆ ధర్మం స్వధర్మం కావచ్చును; జాతి ధర్మం కావచ్చును; దేశ ధర్మం కావచ్చును. వారి ధర్మ బోధకు శిల్ప చాతుర్యమే కావ్యాత్మనిచ్చినది’ అని పండితులు గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య వ్రాశారు. రాష్ట్రాభ్యుదయం, దేశ వైభవం, నైతికోజ్జీవనం, విశ్వ మానవ కల్యాణం- ఇవీ వారి కవితా తత్త్వం అని చెప్పవచ్చును. దీనికి గాంధేయ వాదం పట్టుగొమ్మ. ఇది మానవుని సంస్కరించి సమాజాన్ని ఉన్నతీకరించును. వ్యక్తి సంస్కారం ద్వారా సమాజ సంస్కారాన్ని, సమాజ సంస్కారం ద్వారా ఒక నూతన భారతీయ జీవన విధానాన్ని వారు ప్రబోధించారు. యుగ పురుషుడైన మహాత్మా గాంధీ చరితమును, సర్వోదయ భావాలను ఆధారంగా చేసికొని ఉత్తమ కవితను వెలయించి ‘మహాత్ముని ఆస్థాన కవి’గా వారు కీర్తిగాంచారు.

సామాజిక ప్రయోజనం లేని కవిత సువాసన లేని పూవు వంటిది. ఆధునికాంధ్ర సాహిత్యంలో జాతీయ భావ స్ఫూర్తి, సామాజిక స్పృహ నిండుగా తమ కావ్యాలలో వెలయించిన కవులలో తుమ్మలవారు ప్రముఖులు. వారి కవితలో ఒక గొప్ప సామాజిక వేత్త దర్శనమిస్తారు. ప్రాచీన మహర్షులు మానవులకు కర్తవ్య ధర్మాలను తమ రచనలలో ఉపదేశించినట్టుగా తుమ్మలవారు సమాజాభ్యుదయానికి సుసంపన్నమైన, సందేశాత్మకమైన కావ్యాలను వ్రాశారు.

‘సామాజిక కల్యాణము కామించెద నవ్య భవ్య కవితా సృష్టిన్‌’ అని ప్రకటించి, దేశ కాలములను గుర్తించి, జనహితమైన జనరంజకమైన యుగ కవితను వ్రాశారు. కొందరు కవుల వలె నేటి వ్యవస్థల లోపాలను విమర్శించడం ద్వారా కాలక్షేపం చేయక, అవి ఆదర్శవంతంగా ఎట్లుండవలెనో ప్రబోధించారు తుమ్మల. ఆయన తన కవితా ప్రస్థానాన్ని రాజకీయ, ఆర్ధిక, మత, సాంఘిక, నైతిక ఉద్యమాలకు చైతన్య శక్తిగా మలచారు. వారి రచనలకు ప్రజాసమస్యలే కథావస్తువులు; వాటికి చక్కని పరిష్కార మార్గాలను కూడా వారు సూచించారు. వారి సర్యోదయ కవితకు సాహితీ సౌందర్యం తోడై పాఠకులను ఆనందింపజేయడంతో పాటు, ఆలోచనాపరులను చేసి సంస్కరించింది కూడా. ‘రాష్ట్ర సిద్ధి కొఱకు రక్తమ్ము గార్చిన- కవిని నేను, గాంధి కవిని నేను- బడలి బడలి తల్లిబాస కూడెము చేయు- కవిని నేను, దేశి కవిని నేను’ అని చెప్పుకున్న తుమ్మలవారు తెలుగు జాతికి, సాహిత్యానికి లభించిన అపూర్వమైన కానుక. వారు నిలువెల్లా జాతీయవాది. మహోద్రేక జాతీయభావాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రావతరణకు వారు ప్రాణం పోసిన బ్రహ్మ.


- ఇనగంటి వేదకుమారి (Surya -Telugu Daily)
..................................
తెలుగు లెంక

విశ్వజన శ్రేయస్సును కాంక్షించిన అరుదైన సంప్రదాయ బద్ధుడైన కవి తుమ్మల సీతారామమూర్తి. భాషాపరంగా ఆయన సంప్రదాయ బద్ధుడైనా భావనాపరంగా ఆధునికుడు. పద్య కవి అయిన ఆయన సాహిత్యానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని గాఢంగా విశ్వసించాడు. నైతిక పునర్జీవనం, జాతీయ వికాసం, విశ్వ జనతా శ్రేయస్సు తన కవిత్వ లక్షణాలని చెప్పుకున్నారు. సమాజంలో జరుగుతున్న దోపిడీని, అన్యాయాలను, అక్రమాలను అభ్యుదయ కవుల కంటె ఎంతో ముందుగానే తన కవిత్వం ద్వారా బట్టబయలు చేశారు.

1901 డిసెంబర్‌ 25న గుంటూరు జిల్లా కావూరు గ్రామంలో జన్మించిన తుమ్మల చిన్న వయసులోనే కవిత్వ రచన ప్రారంభించారు. 1920లో జాతీయోద్యమానికి ఆకర్షితుడై కాంగ్రెస్‌ కార్యకర్తగా రూపొందారు. 1924లో కావూరులో ప్రారంభించిన తిలక్‌ జాతీయ విద్యాలయంలో ఆంధ్రోపాధ్యాయుడుగా చేరారు. 1930 నుంచి గుంటూరు జిల్లా బోర్డు హైస్కూళ్ళలో తెలుగు పండితుడుగా పని చేశారు. అప్పికట్ల గ్రామంలో నివాసముంటూ బాపట్ల బోర్డు హైస్కూలులో కూడా పనిచేశారు. తుమ్మల కవిత్వంలో గ్రామీణ జీవిత, ఆంధ్రత్వ, భారతీయత్వ, విశ్వమానవత్వ లక్షణాలుంటాయి. ఆయనది ప్రధానంగా ధర్మప్రబోధనాత్మక కవిత్వం. తాను తెలుగువాడననే అభిమానం ఆయనలో ఎక్కువ. తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంటే పులకించిపోయేవారాయన.

1928లో తుమ్మల ‘ఆత్మార్పణము’ అనే కావ్యాన్ని రచించారు. 1938లో ‘సోదరా లెమ్ము, నీ హక్కులాదుకొమ్ము’ అని ఆంధ్ర రాష్ట్ర సిద్ధి కోసం తన ‘రాష్ట్ర గానం’ ద్వారా తెలుగువారిని వెన్ను తట్టి లేపారు. తెలుగువారి పూర్వవైభవాన్ని ఎలుగెత్తి చాటి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రబోధించారు. 1840లో ధర్మజ్యోతి అనే ఒక ధర్మవరీ గాథను రచించారు. 1943లో ‘పఱిగి పంట’ రచించారు. 1950లో గాంధీజీ ఆత్మకథకు పద్య అనువాదమైన ‘ఆత్మకథ’ను రచించారు. 1953లో ‘ఉదయగానం’ గావించారు. 1955లో ‘శబిల’ అనే ఖండకావ్యాల సంపుటిని వెలువరించారు.

తెలుగు సాహిత్య సరస్వతికి శిరోభూషణమైన ‘సంక్రాంతి తలపులు’ ఈ సంపుటిలోనివే. 1957లో ‘గీతాధర్మము’ పేరుతో భగవద్గీతకు అనువాదం చేశారు. భర్తృహరి నీతిశతకాన్ని ‘తెలుగు నీతి’ పేరుతో తెనిగించారు. జాతీయోద్యమంలో పాల్గొన్న కవులలో తుమ్మల అగ్రగణ్యులు. ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ‘సర్వోదయ’ సిద్ధాంతాన్ని విశదీకరిస్తూ 1960లో ‘సర్వోదయ గానం’ చేశారు. 1963లో తన అభిరుచులు, ఆదర్శాలు, అనుభవాలు వెల్లడి చేస్తూ ‘నేను’ అనే కావ్యాన్ని రచించారు. 1964లో ‘పైరపంట’ రచించారు. 1967లో ఆదర్శప్రాయులైన కొందరు త్యాగధనుల గుణగణాలను విశదీకరిస్తూ ‘సమదర్శి’ రచించారు.

ఆంధ్రుడిగా తుమ్మల తన ‘రాష్ట్ర గానం’ను చట్టపల్లి రాజాకు అంకితమిచ్చారు. భారతీయుడిగా ‘మహాత్ముడి ఆత్మకథ’ను లాల్‌ బహదూర్‌ శాస్ర్తికి, విశ్వ మానవుడిగా ‘నా కథలు’ను అమెరికన్‌ గాంధీ అయిన మార్టిన్‌ లూధర్‌ కింగ్‌కు అంకితమిచారు. కవిత్వంలో యుగధర్మం ప్రతిబింబించాలని చాటి తుమ్మల యుగ కవి అయ్యారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని గాంధీ కవి అయ్యారు. రాష్ట్ర గానం చేసి రాష్ట్ర కవి అయ్యారు. జాతీయోద్యమంలో పాల్గొని జాతీయ కవి అయ్యారు. సిఆర్‌ రెడ్డి ఆయనకు ‘అభినవ తిక్కన’ అనే బిరుదాన్ని ఇచ్చారు. కాని తుమ్మల తెలుగు భాషకు సేవ చేసేవాడిననే అర్ధంలో తనను తాను ‘తెలుగు లెంక’గా పిలుచుకున్నారు. తుమ్మల ‘మహాత్మ కథ’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ నగదు బహుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ శాశ్వత సభ్యుడుగా నియమితులయ్యారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్‌ డిగ్రీని తుమ్మలకు అందజేసింది. 1990 మార్చి 12న తుమ్మల అస్తమించారు.


    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి